తప్పిదాలు సరిదిద్దిన తీర్పు

by Disha edit |
తప్పిదాలు సరిదిద్దిన తీర్పు
X

ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉత్కృష్టమైన పరిణతిని ప్రదర్శించారనడంలో అతిశయోక్తి లేదు. దేశ సమగ్రత, సమైక్యత, దేశ భద్రత, దేశ భవిష్యత్తులకు ఈ తీర్పు పునాదిగా మారుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ను పొందుపర్చారని, ఇది తాత్కాలిక ఏర్పాటే కానీ ఇది ఆ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడానికి నిర్దేశించినది కాదని నిర్ద్వంద్వంగా రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ఈ తీర్పుతో చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దినట్లయింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని దఖాలు పరిచే 370 ఆర్టికల్ రద్దును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించడం కొంతమందికి హర్షాన్ని మరి కొంతమందికి ఖేదాన్ని కలిగించింది. వాస్తవంగా ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. గతంలో రాజ్యాంగానికి సంబంధించిన అనేక విషయాల పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులను వెలువరించినా చాలా తీర్పుల్లో ఏకాభిప్రాయం కొరవడింది. కానీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉత్కృష్టమైన పరిణతిని ప్రదర్శించారనడంలో అతిశయోక్తి లేదు. దేశ సమగ్రత, సమైక్యత, దేశ భద్రత, దేశ భవిష్యత్తులకు ఈ తీర్పు పునాదిగా మారుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ను పొందుపర్చారని, ఇది తాత్కాలిక ఏర్పాటే కానీ, ఇది ఆ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడానికి నిర్దేశించినది కాదని నిర్ద్వంద్వంగా రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 370 ఆర్టికల్‌ను రద్దు పరచే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్ర ప్రభుత్వ చర్యను రాజ్యాంగ ధర్మాసనం ఎత్తిపట్టింది.

23 పిటిషన్ల కొట్టివేత

మోడీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ రద్దు విషయంలో పెద్ద కసరత్తే చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించడం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్ర ప్రాంతాలుగా మార్చడం, కాశ్మీరీ ఏర్పాటు వాదులను ఎక్కడికక్కడ కట్టడి చేయడం, జిహాదీ ఉగ్రమూకలను ఏరి పారేయడం, సైన్యంపై రాళ్లు విసిరే గ్రూపుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఇత్యాది పనులన్నీ చకచకా జరిగిపోయాయి. సరిహద్దుల్లో నిఘా పెంచడం, పాకిస్తాన్ నుండి ఆయుధాలు, నిధులు కాశ్మీరీ ఏర్పాటు వాదులకు అందకపోవడం, వేర్పాటువాద భావజాలానికి దేశంలో మద్దతు లభించకపోవడం, వ్యూహాత్మకంగా కాశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించడం వంటి విషయాలు ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి అనుకూల అంశాలుగా భావించాలి. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ 23 పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వెళ్లాయి. ఈ పిటిషన్ విచారించడానికి 2019 సెప్టెంబర్ 19న ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయింది. 23 పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది.

కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే 370 ఆర్టికల్ రద్దు చేయాలని, ఉద్యమం నడిపిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ కలను మోడీ ప్రభుత్వం సాకారం చేసింది. 'ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలెంగే' (ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ జెండాలు చెల్లుబాటు కావు) నినాదంతో ఉద్యమం నడిపిన ఆయన్ను షేక్ అబ్దుల్లా ప్రభుత్వం 1953 మే 11న అరెస్టు చేసి శ్రీనగర్ జైల్లో పెట్టింది.

అభివృద్ధి పథంలో కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే 370 ఆర్టికల్ లోని వెసులుబాటు వల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి అని సంబోధించవలసి ఉండేది. ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు ఏమిటి అనే విషయం చర్చకు రావడంతో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ప్రధానమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి అని పేరు మార్చిన విషయం దేశ ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు! ఇలా అనేక చారిత్రక తప్పిదాలు ఆ రాష్ట్రం విషయంలో చోటుచేసుకున్నాయి. ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఇక బయటి దేశం యొక్క కుట్రలు, కుతంత్రాలతో, ఏర్పాటు వాదం భావాలతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని సామాన్య ప్రజల బ్రతుకులు అతులాకుతలమైనాయి. వారి జీవితాల్లో వెలుగును నింపాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కాశ్మీర్ పార్టీలు బింకాన్ని వదిలి, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను కొనసాగించి, జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ దేశ ప్రజల ఆకాంక్ష.

ఉల్లి బాల రంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877



Next Story

Most Viewed