ఓటర్ అభిమంత్రం.. ఎవరికి విజయ మంత్రమౌతున్నదో..?

by Ravi |
ఓటర్ అభిమంత్రం.. ఎవరికి విజయ మంత్రమౌతున్నదో..?
X

ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి.. వై నాట్ 175 అన్న ధీమాతో ఉన్న అధికార పక్షం దీనికి అనుగుణంగానే సామాజిక వర్గాల ప్రాతిపదికపై సీట్ల కేటాయింపు అభ్యర్థుల మార్పు లాంటి కసరత్తు చేసింది. జనసేన తెలుగుదేశం కూటమిగా జత కడతాయి అని ఊహించి వ్యూహాలను రచించింది. అయితే బీజేపీ కూటమిలో చేరటం మాత్రం అధికార పక్షం ఊహించలేదు. తొలిదశలో కుదుపులతో ఉన్న కూటమి మోడీ ప్రచారంతో కుదుటపడి అనూహ్యంగా అధికార పార్టీకి పోటీ ఇచ్చింది. అధిక శాతం ఓటింగ్ నమోదైన ఈ తరుణంలో ఓటర్ నాడిని ఎవ్వరూ పసిగట్టలేని పరిస్థితి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి అయిపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ భారీగానే నమోదు అయింది. దాదాపు 81% ఓటర్లు ఏపీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు తరలివచ్చి ఓట్లు వేశారు. పలుచోట్ల నాలుగైదు గంటల సేపు క్యూలల్లో నిలబడాల్సి వచ్చినా అలాగే ఓపిగ్గా ఉండి ఓటు వేసి వెళ్లారు. దీంతో వీరి ప్రభావం పోలింగ్ శాతాల్లో కనిపిస్తోంది.

ఓట్ల శాతం పెరగడంపై..

సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతే కారణమన్న ఓ లెక్క ఉంది. అయితే ఈసారి పెరిగిన పోలింగ్ మాత్రం తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన భారీ మద్దతుగా వైసీపీ చెబుతోంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. వైసీపీ చెబుతున్న లెక్కలు నిజమైతే.. ఆయా ఓటర్ల మద్దతు లభిస్తే వైసీపీ గట్టెక్కినట్టే. అలా కాదని తిరిగి వారంతా పార్టీల వారీగా చీలిపోతే మాత్రం కూటమి విజయం ఖాయమని నిర్ధారణకు వస్తున్నారు. ఇక రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరగడంపై రాజకీయ వర్గాల్లో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2,38,468 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు కాగా.. ప్రస్తుత ఎన్నికలకు 4,32,222 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసినట్టు చెప్పుకుంటున్నాయి. ఈ ఓటింగ్ శాతంని పార్టీలు కూడా తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఉద్యోగులు అధికసంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వ విధానాలు నచ్చి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చినట్లు అధికార వైసీపీ చెప్తోంది. మరి ఉద్యోగుల తీర్పు ఏంటనేదీ జూన్ నాలుగో తేదీన తేలనుంది. ఈ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కసితో యువత వేసిన ఓటు ప్రభుత్వ అనుకూలమా.. వ్యతిరేకమా? అన్నది తేలాల్సి ఉంది.

మహిళా ఓట్లే కీలకంగా..

ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాల ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడానికి.. తమ ప్రాంత వెనుకబాటు కారణమయ్యింటుందని.. అలాగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారు పెద్ద ఎత్తున ఉండటానికి కారణం..రాజధానిపై స్పష్టమైన ప్రజాభిప్రాయం ఇవ్వటానికేనని విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన వారు, పర్యాటకంపై ఆధారపడేవారు రాష్ట్రంలో మార్పు కోరకుంటున్నారన్నది వాస్తవం.

ఇక ఈ ఎన్నికల్లో.. విజయాలను డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది మహిళలు. ఎందుకంటే.. ఓట్లు వేయడానికి మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపించారు. పైగా రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య కంటే.. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇలా ఓట్ల పరంగా, సంఖ్య పరంగా చూసుకున్న, ఇక పోల్ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్న.. పురుషుల కంటే మహిళల శాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించేది మహిళలే అని మాత్రం అర్థమవుతుంది. మరి ఆ మహిళలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకోవడానికి రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

ఈసీ చర్యలు ఫలప్రదం

ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన సవాల్‌ను ఈసీ విజయవంతంగా నిర్ణయించింది. ఓటర్ల జాబితాల తయారీ నుంచి ఎన్నికల పోలింగ్ వరకూ ఎదురైన పలు సవాళ్లను పరిష్కరించడంలో ఈసీ చూపిన చొరవ పోలింగ్ రోజు వరకు కనిపించింది. ఓటర్లు పోలింగ్‌కు రావడానికి ఈసీ ఎంతో కృషి అభినందనీయం. జరిగిన పోలింగ్‌లో ఎక్కడా ఓట్ల గల్లంతు ఆరోపణలు వినిపించలేదు. ఏ ఒక్క పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరిగాయన్న ఫిర్యాదులూ లేవు. అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు ఎదురైనా వాటిని అతి తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా తిరిగి ఓటింగ్ జరిగేలా చూడటంలో ఈసీ సక్సెస్ అయింది. అంతిమంగా ఓటర్లను నిర్భయంగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేలా చూడటంలో ఈసీ విజయవంతం అయినట్లు తెలుస్తుంది. పోలింగ్ అయిపోయినందున ఇక ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓటర్ అభిమంత్రం ఎవరికి విజయ మంత్రమౌతున్నదో వేచి చూడాలి.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445



Next Story

Most Viewed