బీజేపీ వ్యూహాల వెనక అమిత్ షా

by Disha edit |
బీజేపీ వ్యూహాల వెనక అమిత్ షా
X

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం ఉంది. అందుకే బీజేపీ నాయకులు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో చేరికలు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలని అమిత్‌షా సూచన మేరకు పార్టీ నాయకత్వం పరిచేస్తుందననేది సుస్పష్టం. అందుకే బీజేపీ మిషన్ 90, ప్రజా సంగ్రామ యాత్ర, పార్లమెంటరీ ప్రవాసీ యోజన మీటింగ్‌లు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో జనం నుంచి వస్తున్న స్పందన త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సభలు, అనంతరం భారీ బహిరంగ సభ వంటి కార్యాచరణ చూస్తే అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించిందనేది, వచ్చే ఎన్నికలను నామమాత్రంగా కాకుండా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది.

ప్రజాక్షేత్రంలో సంజయుడు

2014 ఎన్నికల ముందు బండి సంజయ్ ఎవరో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా అవగాహన లేదు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలవగానే ఒక్కసారిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైయ్యారు. విద్యార్థి దశ నుండి ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్‌కి బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా కలసివచ్చింది. అంతేకాక తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత బండి సంజయ్‌. ఆయన చేతిలోకి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు వెళ్ళాక ముందువారితో పోలిస్తే మునుపటికి, ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలకు మోదీ స్వయంగా కితాబిచ్చారంటేనే బండి సంజయ్ ఎంత పనితీరు కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కేసీఆర్ మార్కు రాజకీయాలతో మిగిలిన ప్రతిపక్షాలన్నీ డీలా పడినా, బీజేపీ మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో దుబ్బాక ఉపఎన్నిక విజ‌యం సాధించ‌డంలో పార్టీ స‌మిష్టి కృషి.. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై బండి సంజ‌య్ దూకుడుగా వ్యవహ‌రించ‌డం ఆ పార్టీ విజయానికి చాలా ప్లస్ అయ్యింది. హ‌రీష్ రావు, కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను త‌న‌దైన స్టైల్లో ధీటుగా బ‌దులిస్తూ దుబ్బాక వైపు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేయ‌డంలో బండి సంజ‌య్ సఫలీకృతులయ్యారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ అదే స‌త్తా చాటేలా ముందు నుంచి ప్రణాళిక‌లు ర‌చించి హైదరాబాద్ వ‌ర‌ద‌లు, వ‌ర‌ద సాయం అంద‌జేయ‌డంలో ప్రభుత్వ విఫ‌లం, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, హైద‌రాబాద్ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫ‌లం లాంటి అంశాల‌ను ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా మలుచుకొని ఎన్నిక‌ల బ‌రిలో అధికార పార్టీతో పోటీప‌డి కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనుకునేలా జనం దృష్టిని ఆకర్షించడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.

తెలంగాణలో బోణీ కొట్టాలని

కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం సాధించిన బండి సంజయ్ క్రమంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్‌పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరి కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. అయితే బండి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పార్టీని మరింత మెరుగుపరచాలంటే సెంటిమెంట్ ఫార్ములాని పక్కకు పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన శైలిని మార్చుకోవాలి. ఇటీవల బండి సంజయ్ సచివాలయం గురించి చేసిన వ్యాఖ్యలను బీఅర్ఎస్‌కు కొంత మైలేజిని తెచ్చిపెట్టినాయి. అలాగే పార్టీలోని సీనియర్లను ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకలను సమన్వయ పరచి ఈటెల సేవలను మరింత ఫలవంతమైనవిగా మలచుకుంటూ చరిష్మా ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకురావాలి. చర్విత చరణమైన సమస్యలు ప్రస్తావించకుండా కొత్త సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలి.

దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో బోణీ కొట్టాలని ఎప్పట్నుంచో ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు మరొకరికి అప్పగించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహానికి అడ్డుకట్ట వేయకూడదన్న తలంపుతో బండి సంజయ్‌కే ఆ బాధ్యతను అప్పగించింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో పోరు, బీఅర్ఎస్‌లో ఆసమ్మతితో భంగపాటుదారులు కమలం గూటికి చేరవచ్చు. చరిష్మా ఉన్న నాయకులకు టిక్కెట్లు దక్కవచ్చు. బీజేపీ‌కి ఆభ్యర్దులే లేరన్న బిఆర్‌ఎస్ నాయకులకి ఆమిత్ షా వ్యూహాలు అంతు చిక్కడంలేదు. జాతీయ స్థాయిలో కలిసివస్తామన్న నేతల తీరు, ఇటీవల రాజకీయ పరిణామాలు గులాబి దళ అధినేతను ఒక్కింత నిరుత్సాహానికి గురి చేశాయి. రానున్న కాలంలో తెలంగాణలో రాజకీయ చిత్రం మారబోతోందన్నది సుస్పష్టం.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Also Read..

ప్రణాళిక లేని బీజేపీ హామీలు


Next Story

Most Viewed