అంబేడ్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక

by Disha edit |
అంబేడ్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక
X

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అస్తమించని మేధో సూర్యుడు. అంబేద్కర్‌కి పూర్వం, అంబేద్కర్ తర్వాత భారతదేశాన్ని మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేద్కర్‌కి పూర్వం భారతదేశం మనస్మతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌఖికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతత్వరాజ్యం. డా॥బి.ఆర్ అంబేద్కర్ జన్మించిన పది సంవత్సరముల నుండి భారతదేశం రూపురేఖలను మార్చేయడానికి ఆయన కషి చేసి లౌఖిక ప్రజాస్వామిక సామ్యవాద దేశంగా మార్చివేశారు. ఆయన శిల్పించిన దేశమే భారతదేశం. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వంలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమర్పించారు. భారతదేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి.

డా॥బి.ఆర్.అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నికగన్న మేధావి. తత్వవేత్త, మేధావి, దార్శనికుడు అని ఎవరని అంటారు. ప్రపంచ సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్‌కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్‌ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. అంబేడ్కర్ బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు వున్న మేధావి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అస్పృశ్యతల నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించిన మేధావి ఆయన. అణగారిన ప్రజల హక్కులకు సిద్ధాంత రూపాన్నేగాక, చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణకర్త ఆయన. దళితుల విముక్తి చట్టాలేగాక, చట్టాల రూపకల్పన సామర్థ్యం కోసం రాజ్యాధికారం కూడా ఎలా అవసరమో నిగ్గు తేల్చిన ప్రయోక్త అంబేడ్కర్.

డా॥ అంబేడ్కర్ పరినిర్మాణం చెంది 67వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగలేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాపితమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే అని మనకు అర్థం అవుతుంది. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రాశారు.

డా॥బి.ఆర్ అంబేడ్కర్ సుందరమైన, నాగరికమైన లండన్ నగరంలో తన జీవితాన్ని ఒక విద్యాపిపాసిగా గడపడంలో విజ్ఞతను చూపారు. ఆయన లండన్ నగరాన్ని అంతరంగికంగా ఎక్కువ చూశారు. ఆయన రాజ్యాంగం రాయటానికి ఆ అంతర్ దృష్టి ఎంతో ఉపయోగపడింది. నగరాలు ఎలా ఏర్పడ్డాయి? నాగరికతలు ఎలా ఏర్పడ్డాయి? చారిత్రకంగా వాటి ప్రాధాన్యత ఏమిటి? అవి అని ఎప్పుడు ఎలా అత్యున్నత స్థాయికి వెళ్ళాయి? ఎలా శైథిల్యమయ్యాయి? అందుకు గల అంతరంగిక బహిరంగ కారణాలు ఏవి? ఈ దృష్టితో అంబేడ్కర్ తను నివసించిన నగరాలను చూశారు. ఆయన లండన్‌లో కూడా మాన్‌టేగ్, విఠల్‌బాయ్ పటేల్ వంటి వారితో మాట్లాడే సందర్భంలో కూడా అస్పృశ్యుల సమస్యను మరువలేదు. అంటే ఆయన విద్యార్జన గమ్యం అస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో వుండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్ధేశత నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవుతారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్‌వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్‌లో వున్నప్పుడు కూడా ఆయన మనస్సు భారతదేశ అస్పృశ్య సమాజం మీదే వుండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పనిచేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వుండేవారు.

అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా వారి మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆ సందేశం వ్యక్తిగతమైంది కాక, స్వార్థపూరితమైంది కాక జాతి శ్రేయస్సుకొరకు అయితే ఆ జాతి ప్రజలు ఆ నాయకుడిని గుర్తిస్తారు. అతని కృషికి శత్రువులు సైతం అవలోకిస్తారు. అందుకే నాయకుని జీవితం జాతికి నిరంతర పఠనీయ గ్రంథం అవుతుంది.

అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది ఆయన పూర్తికుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాధలను ఆయనే ఇలా అభివర్ణించాడు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రదర్శిస్తూ వీరోచితమైన సాహసాన్ని మొక్కవోని నిబ్బరాన్ని, ధైర్యాన్ని కొనియాడదగిన నిశ్చితత్వాన్ని ప్రదర్శించి వారు మహర్ సైనికులకి శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటీష్ ఆఫీసర్లదా? (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి.గోర్మన్ తన హిస్టారికల్ రికార్టే ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 17961933లో పేర్కొన్నారు.

ఆనతి కాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్‌లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు వున్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తలపెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్థూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. ఈ చిహ్నంపై యుద్ధ క్షేత్రంలో మరణించిన, గాయపడిన వారి పేర్లను చెక్కాలని నిర్ణయించారు. ‘భారతీయ సైన్యానికి’ అని చెక్కిన ప్రత్యేక మెడల్ 1851లో జారీ అయింది. ‘కిర్కీ’ ‘కోరెగాంవ్’ జ్ఞాపకార్థం ఆ మెడల్ రెండు వైపులా వారి పేర్లు చెక్కారు.

బాంబే ఆర్మీ ఆపరేషన్లలో మహర్లు పాల్గొనడం కొనసాగించారు. వారికి వృత్తిపట్ల అచంచలమైన నిబద్ధత, సాహసాలను ఇది రుజువు చేస్తోంది. వారు కథియవార్ (1826) ముల్తానన, గుజరాత్ (1849), కాందహార్ (1880) యుద్ధ క్షేత్రాలలో తమ సాహసోపేతమైన పోరాటంతో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. మొదటి, రెండవ అప్ఘాన్ యుద్ధాలలో, మియానీ యుద్ధం (1843), పెర్షియా యుద్ధం (185657)లో బాంబే ఆర్మీ పాల్గొన్నది. ఈ సేనలకు చెందిన సైనికులు చైనా (1860) ఆడెన్ (1865), అబిసీనియా (1867)లకు వెళ్ళారు. తన నేతృత్వంలో సింధ్‌పై సాధించిన విజయంలో 25 బాంబే నేటివ్ ఇన్‌ఫాంట్రీ (పదాతి దళం) చేసిన సాహసాలను జనరల్ సర్ ఛార్లెస్ నేపియర్ మరువలేదు. అస్పృశ్యులు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యులవాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణ దేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికి కారంపూడిలో వుంది. దళితులు అస్పృశ్యులు కాదని నిరూపించాడు.

డా॥ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ వుంది. కాని భారతదేశంలో లక్షలాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతూనే వుంది. ఎన్నో హోటళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా వుంచుతున్నారు. ప్రభుత్వం పనిగట్టుకొని ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తూ అస్పృశ్యతను ఆచరిస్తూ వుంది. రాజ్యాంగనీతి నేతిబీర సూక్తిగా మిగులుతూ వుంది. డా॥అంబేడ్కర్ రాజ్యాంగ చర్చల సందర్భంగా సోషలిస్టు సిద్ధాంతాల నుండి రాజ్యాంగం రూపొందిందనీ శాసనాధికారం నుండి సోషలిజాన్ని సాధించాలని పేర్కొనడం జరిగింది. కాని ఆచరణలో ధనస్వామిక శక్తుల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతూ వుంది.

భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ను వివరిస్తూ డా॥అంబేడ్కర్ ‘‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయడానికి వీలులేదు’’ అని స్పష్టం చేసారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ వుంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టి.వి., మొదలయిన వాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు డా॥అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ వుంది. సెక్యులరిజమంటే ‘‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థము. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి డా॥ అంబేడ్కర్‌కు, ఆయన ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురాను అంబేడ్కర్ యొక్క అవసరం పెరిగింది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయనను మేధావిగా గుర్తించడమే కాక ఆయన ఆర్కిటెక్చర్ పెరిగింది. ఈ రోజున లండన్ లోని ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం వుంది. లండన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం వుంది. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా కూడా ఆయన నిలువెత్తు విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతుంది. ఈ రోజు విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల విగ్రహం జనవరి 14వ తేదిన ఆవిష్కరించబడుతుంది. ఈ నిర్మాణమంతా ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షతకు, ప్రతిభ సామర్థ్యానికి ఆయన సాంస్కృతిక విప్లవ పతాకగా గుర్తిస్తున్న సందర్భంగా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు కుల, మతాలకు అతీతంగా లౌకికవాద భావనకు నిలువెత్తు సాక్ష్యంగా నిరంతరం వెలుస్తూనే వున్నాయి. ఈనాడు ఆయన భావజాల విప్లవం కూడా అవసరం. మనమందరం ఆయన వర్థంతికి నివాళిగా ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలనా, అస్పృశ్యతా నివారణా, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అందుకే ఈ వర్ధంతికి ఆయన వెలుగుల బాటలో నడుద్దాం. సమతా సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం.

- మహా కవి కత్తి పద్మారావు

9849741695



Next Story

Most Viewed