బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు?

by Disha edit |
బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు?
X

దేశంలో అత్యధిక ఓటర్లు బీసీ కులాల వారే అనే విషయం ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. కానీ వారికి రాజ్యాధికారం ఇవ్వడానికి మాత్రం అంగీకరించరు. బీసీ కుల గణన విషయంలో ప్రజలను మభ్యపెడుతూ తప్పుదోవ పట్టించి వారిని మరిపించి మురిపించే ప్రయత్నం చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి బీసీ కుల గణన కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం బీసీలు ఉన్నా, వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం.

అన్నీ రాష్ట్రాల్లోనూ బీసీలకు అన్యాయం!

మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది, ఆ సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు. అయితే జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కుల గణన అంశం చర్చకు రాకపోవడం బాధాకరమైన విషయం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్పా, 70 యేండ్లు గడిచినా, నేటికీ బీసీ కుల గణన చేపట్టడం లేదు. వీరి గణన వివరాలు చేపట్టాలని సుప్రీంకోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నదనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్న. మన దేశంలో ఉన్న రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థలు, అసెంబ్లీ, కమిషన్లతోపాటు, అనేక రాజకీయ పార్టీల కార్యనిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత మంది? అందులో బీసీల శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు. కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం బాధాకరం. జనాభా లెక్కలలో ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికి సరైన రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బీసీ కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుంది. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సారి మేము గెలిస్తే బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని మురిపించి ఓట్లు దండుకుని గెలిచాక ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు.

రాష్ట్రంలోనూ ప్రాధాన్యత కరువు

ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని నాయకులు కనీసం స్వరాష్ట్రం వస్తే బీసీ కులగణన చేపడుతామని హామీ ఇస్తే దీంతో తమ ఆకాంక్షలు నెరవేరి విద్య, వైద్య, ఉద్యోగం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, తమ హక్కులకు రక్షణ కలుగుతుందని భావించి తెలంగాణ ఉద్యమంలో అనేకమంది బీసీలు పాల్గొన్నారు. వారు పోలీస్ లాఠీ దెబ్బలకు వెనుతిరగకుండా, ఆత్మబలిదానాలను కూడా లెక్కచేయకుండా అమరులై స్వరాష్ట్రం సాధించుకున్నారు. ఈ పోరాటంలో అమరులంతా బీసీలే కానీ స్వరాష్ట్రంలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం. ఉద్యమంలో ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు. ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన బీసీలకు ఎన్నికల్లో సరైన సీట్లు కేటాయించకుండా కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపింది. ఇక తొమ్మిదేండ్ల పాలనలో విసుగు చెందిన బీసీ కుల సంఘాలకు చెందిన మేధావుల్లో, యువతలో ఇంకెన్నాళ్లు అర్ధ బానిసలుగా బతకాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్గత వివక్షను వ్యతిరేకిస్తూ రాజ్యాంగం సూచించిన తమ హక్కుల పరిరక్షణ కోసం, పాలనలో సరైన వాటా కోసం, సమిష్టి ఉద్యమాలు ఎంతైనా అవసరమని భావిస్తూ బీసీ కుల సంఘాలన్నీ ఐక్యంగా, ఇక లక్ష్యంగా రాజకీయ ఉద్యమ వేదికల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

బీసీలందరు ఏకం కావాలి!

అందుకే అగ్రవర్ణాల ఆధిపత్యంతో అణచివేతకు గురవుతున్న బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలు బీసీ సంఘాలు సంకేతాలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు కులాల వారీగా రాజకీయ పోరుబాట పట్టే సంఘాలు ఇప్పటి నుంచే సమావేశమవుతున్నాయి. ఏది ఏమైనా బీసీ ప్రజలంతా ఒక్కటిగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం పోరాడితేనే రాజ్యాధికారం దక్కుతుందనేది జగమెరిగిన సత్యం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం, బీసీ కుల గణన విషయం తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఏదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీలకు రాజ్యాధికారం అందించేలా కృషి చేయాలనీ ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి.

కోట దామోదర్

93914 80475



Next Story

Most Viewed