Funeral: గౌరవప్రద అంత్యక్రియలు అందరి హక్కు

by Disha edit |
Funeral: గౌరవప్రద అంత్యక్రియలు అందరి హక్కు
X

ఇన్సూరెన్స్ సంస్థలు అంత్యక్రియల బాధ్యతను తీసుకోవడం తప్పనిసరి చేయాలి. అలా తీసుకునే బ్యాంకులలో, ఇన్సూరెన్స్ సంస్థలలోనే పాలసీ తీసుకోవడం అవసరం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్స్‌తో టై అప్ పెట్టుకున్నట్టుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేపట్టే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఎంతో మంది మహనీయులు వారి శరీరాన్ని హాస్పిటల్స్‌కు దానం ఇస్తున్నారు. వారికి ఏదో ఒకనాడు వారి మిగిలిన శరీర అవయవాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపడం కనీస బాధ్యత. వారు ఈ బాధ్యత చేపడితే ఎంతో మంది తమ దేహాలను వైద్య పరిశోధనలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మరణానంతరం అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగడం ప్రతి మనిషి మానవ హక్కు. ధనిక పేద, కుల, మత, ప్రాంత, మహిళ, పురుష వివక్షకు తావులేకుండా అందరికీ గౌరవప్రద అంత్యక్రియలు వారి జన్మహక్కు.

గౌరవప్రద అంత్యక్రియలు అందరి హక్కు. బతికినంత కాలం ప్రతి మనిషి ఈ సమాజం అస్తిత్వం కోసం అందులో భాగంగా జీవించాడు. మనిషి జన్మించినప్పుడు సంఘజీవిగా జన్మిస్తాడు. జన్మిస్తుంది. మనిషి మరణం, అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా సాగాలి. భౌతికకాయం కూడా వారి జీవితంలో భాగమే. మరణానంతరం కూడా వారి గౌరవిస్తూ దండలు వేస్తాము. దండం పెడుతాము. ప్రతి ఒకరికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరగడం మానవ జన్మహక్కు. శవ దహనం, శవ ఖననం గొప్ప పుణ్యకార్యం. ఈ పనుల కోసం జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కార్పొరేట్ స్థాయిలో ఒక సంస్థ వెలసింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి సంస్థల సేవలు ఊరూరా విస్తరించాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే సంస్థను పెట్టిన వారికి జోహారులు. రూ.37 వేలు ఖర్చులకు తీసుకుంటున్నారని తెలిసింది. ఇది చాలా తక్కువే.

జగిత్యాల వంటి టౌన్‌లలో కూడా అంత్య క్రియలకు రెండు లక్షలకు పైనే ఖర్చు అవుతున్నది. సకాలంలో దూర తీరాల నుండి బంధుమిత్రులు చేరుకోవడం, అంత్యక్రియల(Funeral) విధి విధానాలు తెలియకపోవడం, ఖర్చులు పెరిగి అప్పులపాలవడం చాలా చోట్ల జరుగుతున్నది. గౌరవప్రదంగా తక్కువ ఖర్చుతో అంత్య క్రియల విధి విధానాలు రూపొందించుకోవడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియలకు ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయిస్తున్నది. అంత్యక్రియల సేవల కోసం జీవితాలను అంకితం చేసి సేవలు చేస్తున్న మనుషుల గురించి పత్రికలలో చూస్తుంకుంటాము. వారు మహనీయులు.

వారు బాధ్యత తీసుకోవాలి

నిజానికి ఈ అంత్యక్రియల బాధ్యతను ప్రభుత్వం, మున్సిపల్ వంటి స్థానిక సంస్థలే కాకుండా ప్రధానంగా ఇన్సూరెన్స్ సంస్థలు తీసుకోవాలి. జీవితమంతా కిస్తులు కట్టి, లక్షలాది ఉద్యోగులకు ఉపాధి కల్పించిన క్లయింట్లు చనిపోతే, చనిపోయిన మనిషి పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, కేవలం నామినీలకు 'మీ పైసలు ఇవిగో' అంటూ విదిలిస్తున్నాయి ఇన్సూరెన్స్ సంస్థలు. మరణించిన వారిని మాత్రం వదిలేస్తాయి. బీమా సంస్థలు చావు భయం చూపించి, మరణానంతరం పిల్లల భవిష్యత్ భద్రత అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు సేకరిస్తున్నాయి. కానీ, ఆ మనిషి అంత్యక్రియలకు ఒక విభాగం ఏర్పాటు చేసి సహకరించాలనే మానవత్వం చూపలేకపోతున్నాయి. చెప్పేది మనిషి మానవత్వం, మరణానంతర నామినీల భవిష్యత్ గురించి 'మీరు పోయాక' అంటూ బెదిరించినట్లు ఆలోచింపజేసే వీరు 'మీరు పోయాక మీకు సగౌరవంగా అంత్య క్రియలు' చేస్తాం అని అనలేకపోయారు. తద్వారా వారు వ్యాపారం చేయడమే తప్ప 'మనిషితో మానవత్వంతో మాకేం పని' అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మహాభారత యుద్ధంలో లక్షలాది మంది మరణించారు.

శతాబ్దాలుగా యుద్దాలలో, ప్రపంచ యుద్ధాలలో కోట్లాది మంది మరణించారు. వారందరికీ గౌరవప్రదంగా అంత్యక్రియలు సాధ్యం కాలేదు. చివరకు పాండవులకు కూడా గౌరవప్రద అంత్యక్రియలు జరగలేదు. నడుస్తూ నడుస్తూ ఎక్కడో పడిపోయారు. తమ్ముళ్లు, ద్రౌపది అని కూడా ధర్మరాజు వెనక్కి తిరిగి చూడలేదు. సీతమ్మ తల్లికి కూడా అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగలేదు. భూమిని చీల్చుకొని వెళ్లిపోయింది. మన్మథునికి కూడా శివుడు గౌరవ అంత్యక్రియలు చేయలేదు. కాలం మారి అవసరాలు మారి ఇన్సూరెన్సు కంపెనీలు(insurance companies), బ్యాంకులు వెలిసాయి. నోబుల్ బహుమతులను బ్యాంకుల ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తున్నారు. బ్యాంకులు డిపాజిట్లు సేకరించడంతోపాటు అంత్య క్రియల బాధ్యతను కూడా తీసుకోవాలి.

తప్పనిసరి చట్టం తేవాలి

ఇన్సూరెన్స్ సంస్థలు అంత్యక్రియల బాధ్యతను తీసుకోవడం తప్పనిసరి చేయాలి. అలా తీసుకునే బ్యాంకులలో, ఇన్సూరెన్స్ సంస్థలలోనే పాలసీ తీసుకోవడం అవసరం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్స్‌తో టై అప్ పెట్టుకున్నట్టుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేపట్టే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఎంతో మంది మహనీయులు వారి శరీరాన్ని హాస్పిటల్స్‌కు దానం ఇస్తున్నారు. వారికి ఏదో ఒకనాడు వారి మిగిలిన శరీర అవయవాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపడం కనీస బాధ్యత. వారు ఈ బాధ్యత చేపడితే ఎంతో మంది తమ దేహాలను వైద్య పరిశోధనలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మరణానంతరం అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగడం ప్రతి మనిషి మానవ హక్కు.

ధనిక పేద, కుల, మత, ప్రాంత, మహిళ, పురుష వివక్షకు తావులేకుండా అందరికీ గౌరవప్రద అంత్యక్రియలు వారి జన్మహక్కు. మనిషి జన్మను ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అంతిమ వీడ్కోలు అంతే గౌరవంగా జరిగేలా చూడడం అవసరం. అవయవ దానం పేరిట, బతకాల్సిన వారి కోసం చేస్తున్న అవయవదాన ఉద్యమకారులు మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగే బాధ్యత తీసుకోకపోతే అది అవసరానికి వాడుకొని శవాన్ని వదిలేయడం అవుతుంది.

వారికి అండగా ఉండాలి

మనిషి అంత్యక్రియలు గౌరవప్రదంగా తక్కువ ఖర్చుతో జరిగే విధి విధానాలను, అట్టి బాధ్యతలను జనన, మరణ రిజిస్టర్ నిర్వహించే మున్సిపాలిటీ, స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేదోడుగా ఉండడం అవసరం. మనిషి ఏకాకి కాదు. మనిషి సంఘజీవి. మనిషి పుట్టుకతోనే సంఘజీవి. మనిషి మరణం తరువాత కూడా సంఘజీవిగానే గౌరవప్రద అంత్యక్రియలతో వీడ్కోలు పలకాలి. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపే సంస్థలను ప్రభుత్వం జీఎస్‌టీ నుంచి మినహాయించాలి. కావలసిన సామగ్రిని రాయితీ మీద అందజేయాలి.

బీఎస్ రాములు

సామాజిక తత్వవేత్త

83319 66987

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

Christmas: క్రిస్మస్ చెట్టు వెనకున్న కథలేంటో తెలుసా?

Next Story