24 ఫ్రేమ్స్ :ఫిల్మ్ అకాడెమీతో అవకాశాలు

by Disha edit |
24 ఫ్రేమ్స్ :ఫిల్మ్ అకాడెమీతో అవకాశాలు
X

తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిల్మ్ అకాడెమీ ఏర్పాటు చేస్తే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ సినిమాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. సినిమా రంగం పట్ల అభిమానంతో, ఆసక్తితో ఉన్న యువతకు గొప్ప అవకాశాలు వస్తాయి. అకాడెమీ నేతృత్వలో ఇన్‌స్టిట్యూట్, 'అర్కయివ్స్' ఏర్పాటయితే తెలంగాణ టాలెంట్‌కు కొత్త ఊపు వస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ కల్చర్ రూపొందించుకునే అవకాశమూ ఏర్పడుతుంది. తెలంగాణ చరిత్ర సంస్కృతీ, జీవన విధానమూ దృశ్యమానం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో గొప్ప సృజన కలిగిన యువతీయువకులున్నారు. తమ పరిధి మేరకు ఆడియో సీడీలు, షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ వీడియోలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. షార్ట్ ఫిల్మ్ ఇవ్వాళ తెలంగాణ యువతకు గొప్ప ఊరట గా వుంది.

శాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ కూడా తనదైన సాంస్కృతిక రంగ వికాసం కోసం చేసిన ప్రయత్నాలు అతి స్వల్పమేనని చెప్పొచ్చు. సాంస్కృతికరంగ కాన్వాస్‌పైన చిత్రించుకుని నిర్మించుకున్న ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మాట, పాట, ఆట, కొంతమేర సినిమా రంగ భూమికగా కూడా తెలంగాణ ఉద్యమం ఎగిసిన జ్ఞాపకాలు ఇంకా తడితడిగానే వున్నాయి. ఆయితే, ఆ మూల సాంస్కృతిక అంశాల ప్రాతినిధ్యమూ, ఎదుగుదలా ఇవ్వాళ ప్రశ్నార్థకం అయ్యాయి. ఆయా కళారంగాలలో తెలంగాణ యువతకు శిక్షణనిచ్చేందుకు కావలసిన కేంద్రాలు కానీ, అకాడెమీలు కానీ ప్రారంభించుకోలేకపోయాం.

నీళ్లు, నియామకాల విషయంలో ముందున్నప్పటికీ, మనిషి విలువలపరంగానూ, మానసికంగానూ శాశ్వతంగా ఎదగడానికి అవసరమైన సాంస్కృతిక భూమికను రూపొందించుకోలేకపోయాం. దానికోసం వేలాది కోట్ల డబ్బు అవసరం లేదు. ఇప్పటికయినా ఆ దిశలో ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా అత్యంత ప్రభావశీలంగా ఉన్న చిత్రసీమలో 'తెలంగాణ సినిమా' ఉనికిని చాటుకోవడానికి, ప్రతిభను పెంపొందించుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాను.

నాటి నుంచే మొదలైన కృషి

సంగీత, నాటక తదితర సామూహిక రంగాల అభ్యున్నతి కోసం ఉమ్మడి రాష్ట్రంలో పలు అకాడెమీలు మంచికో చెడ్డకో మనుగడ సాధించాయి. కానీ, ఆ అకాడెమీలను 1985లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేసింది. అప్పటినుండి వాటి ఉనికి లేకుండాపోయింది. మరోరకంగా చెప్పాలంటే, అవి ఎటూ కాకుండా పోయాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత అకాడెమీల పునరుద్ధరణ జరుగుతుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అకాడెమీల ఆలోచన బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. 1944లోనే 'నేషనల్ కల్చరల్ ట్రస్ట్' ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది.

1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రం 1952లో సాహిత్య, సంగీత నాటక అకాడెమీలను ఏర్పాటు చేసింది.మొట్టమొదటి సాహిత్య అకాడెమీకి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధాని అయినందునే కాదని, రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందినవాడు కనుక ఎన్నుకున్నామని అకాడెమీ ప్రకటించింది. సాహిత్య అకాడెమీ అన్న పదబంధంలో సాహిత్య అన్నమాట సంస్కృతం కాగా అకాడెమీ అన్నది గ్రీకు పదం. అంటే దీనిని సాహిత్యానికి విశ్వదృష్టి ఉండాలన్నది ఒక సూచనగా తీసుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడెమీ యేటా పదుల సంఖ్యలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. అదే క్రమంలో లేదా అంతకు మించిన రీతిలో తెలంగాణ సాహిత్య అకాడెమి కృషి చేస్తుందని తెలంగాణ సాహితీకారులు భావిస్తున్నారు.

పాటిల్ కమిటీ సూచించినా

నెహ్రూ కాలంలోనే కేంద్రం అత్యంత ప్రభావవంతమైన భారతీయ సినిమారంగానికి సంబంధించి సూచనలు చేసేందుకు ఎస్.కె.పాటిల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకే దేశంలో పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, పూనా ఫిల్మ్ ఆర్కయివ్స్, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ ప్రారంభించింది. ఫలితంగా భారతీయ సినిమా రంగంలో ఆర్ట్ సినిమాలకూ, అర్థవంత సినిమాలకూ గొప్ప స్థానం దొరికింది.

భారతీయులు ప్రపంచ సినిమాను వీక్షించేందుకు అవకాశం కలిగింది. అపురూప సినిమాలను ఆర్కయివ్స్‌లో భద్రపరిచే అవకాశమూ కలిగింది. అంతేకాదు, కొత్త టాలెంటును రూపొందించుకునేందుకు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఎంతో కృషి చేసింది. దాని ద్వారానే నసీరుద్దీన్ షా, ఓంపురి, షబానా ఆజ్మీ లాంటి ప్రపంచస్థాయి నటులు తయారయ్యారు. ఇలా నెహ్రూ విజన్, పాటిల్ కమిటీ సూచనలు భారతీయ సినిమాకు ఎంతో దోహదపడ్డాయి. కానీ, పాటిల్ కమిటీ సూచనలలోని మరో అంశం 'ఫిల్మ్ కౌన్సిల్' లేదా 'ఫిల్మ్ అకాడెమీ' ఏర్పాటు మాత్రం జరగలేదు.

కొన్ని రాష్ట్రాల ప్రోత్సాహం

'ఫిల్మ్ కౌన్సిల్' సినిమా నిర్మాణానికి, ప్రదర్శన, పంపిణీ రంగాలకు సంబంధించిన సూచనలు చేస్తుందని, క్రమశిక్షణ నెలకొల్పుతుందని భావించారు. కానీ, ఏవో కారణాలతో జాతీయస్థాయిలో దాని ఏర్పాటు జరగలేదు. 1985లో 'ఫిల్మ్ కౌన్సిల్' భావనను స్ఫూర్తిగా తీసుకుని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతాలో 'నందన్ సినిమా కాంప్లెక్స్' ఏర్పాటు చేసింది. అందులో పలు థియేటర్లు నిర్మించింది. సినిమా నిర్మాణం, వసతులు తప్ప సినిమాకు మిగతా అన్ని విషయాలలో అది కృషి చేస్తున్నది. కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నది. 1998లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, 2009లో కర్ణాటక ప్రభుత్వం చలనచిత్ర అకాడెమీలను ఏర్పాటు చేశాయి.

ఈ రెండు రాష్ట్రాలూ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా అర్థవంత సినిమాలకు ఇతోధికంగా ప్రోత్సాహమిస్తున్నాయి. కేరళ ఫిల్మ్ అకాడెమీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మలయాళీ సినిమా ఎదుగుదలకు, సినీ కళాకారుల ప్రతిభ మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నది. కర్ణాటక చలన చిత్ర అకాడెమీ కూడా కన్నడ సినిమాకూ అంతర్జాతీయ సినిమాకు వారధిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

ఇక్కడ కూడా ఏర్పడితే

అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిల్మ్ అకాడెమీ ఏర్పాటు చేస్తే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ సినిమాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. సినిమా రంగం పట్ల అభిమానంతో, ఆసక్తితో ఉన్న యువతకు గొప్ప అవకాశాలు వస్తాయి. అకాడెమీ నేతృత్వలో ఇన్‌స్టిట్యూట్, 'అర్కయివ్స్' ఏర్పాటయితే తెలంగాణ టాలెంట్‌కు కొత్త ఊపు వస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ కల్చర్ రూపొందించుకునే అవకాశమూ ఏర్పడుతుంది. తెలంగాణ చరిత్ర సంస్కృతీ, జీవన విధానమూ దృశ్యమానం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో గొప్ప సృజన కలిగిన యువతీయువకులున్నారు. తమ పరిధి మేరకు ఆడియో సీడీలు, షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ వీడియోలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు.

షార్ట్ ఫిల్మ్ ఇవ్వాళ తెలంగాణ యువతకు గొప్ప ఊరటగా వుంది. కొంత మంది వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఈ స్థితిలో వారందరికీ తెలంగాణ ఫిల్మ్ అకాడెమీ గొప్ప అవకాశంగా కలిసి వస్తుంది. తెలంగాణ సినిమాను తెలుగు ప్రధాన స్రవంతి సినిమాకు ప్రత్యామ్నాయం అని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటిలో ఆ పరిస్థితి కూడా లేదు. ముంబై దేశంలోనే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన హిందీ సినిమాకు కేంద్రంగా ఉన్నప్పటికీ, అక్కడే మరాఠీ సినిమా పుట్టి ఎదిగి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలదొక్కుకోగలిగింది. మరాఠీ సినిమా తెలంగాణ సినిమాకు ఒక ప్రేరణ కావాలి. ఈ దిశలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయాలి.

వారాల ఆనంద్

94405012181

Next Story