సామాన్యులను విస్మరించిన బడ్జెట్..

by Viswanth |
సామాన్యులను విస్మరించిన బడ్జెట్..
X

ప్రతి సంవత్సరం జనవరి చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో సామాన్యులకు ఏదైనా సహాయం అందుతుందా, తమ అభివృద్ధికి బడ్జెట్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందా, దాంతో తమ జీవితాలు చక్కబడుతాయా అని ఆశతో ఎదురుచూడటం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి బడ్జెట్ కాపీలను చదివి వినిపించారు. అయితే, గత సంవత్సరం లాగానే తాజా బడ్జెట్‌లో కొత్తదనం లేదు. సామాన్యులకు పెద్దగా ఉపయోగం లేకున్నా, వారి అవసరాలను తీర్చి, వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ కొత్త సీసాలో పాత సారాయి లాగా ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ ఉసురు మనిపించింది. దేశ అభివృద్ధికి బడ్జెట్ ఎంతో కీలకం. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ పేద మధ్యతరగతి వర్గాల వారి ఆకాంక్షలను నెరవేర్చేదిగా లేకుండా, వారి భారాన్ని తగ్గించేదిగా, వారి అభివృద్ధికి చేయూత నిచ్చేదిగా లేకపోవడం విచారకరం.

కేటాయింపులు

2023 బడ్జెట్‌ను పరిశీలిస్తే అమృతకాల్ బడ్జెట్ అంటూ ఏడు అంశాలకు ప్రాధాన్యత కల్పించారు. అవి సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడటం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, వ్యక్తుల్లోని సామర్థ్యాన్ని వెలికి తీయడం, గ్రీన్ ఎనర్జీ, యువశక్తి ఆర్థిక రంగాన్ని బలపరచడం వంటి అంశాలతో కేంద్రం బడ్జెట్‌ను రూపొందించింది. వృద్ధిరేటును ఏడుగా పేర్కొంది. తలసరి ఆదాయం రెట్టింపయిందని తెలిపింది. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, అలాగే 2024 వరకూ ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగిస్తామని ప్రకటించారు. మొత్తం వ్యయం రూ. 45.03 లక్షల కోట్లు, ప్రణాళిక వ్యయం 19.44 లక్షల కోట్లు, ప్రణాళికేతర వ్యయం 25.59 లక్షల కోట్లుగా తెలిపింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 15వేల కోట్లు, రైల్వేలకు 2.40 లక్షల కోట్లు, రైతులకు వ్యవసాయ రుణాలు, సహకార సంఘాల డిజిటలైజేషన్ కోసం 25.16 లక్షల కోట్లు, గిరిజన మిషన్ కోసం రూ. 10,000 కోట్లు, పీఎం ఆవాస యోజన కోసం 79 వేల కోట్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం రూ. 5,943 కోట్లు కేటాయించారు. 38,800 ఉపాధ్యాయుల పోస్టుల నియామకం కోసం, తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలకు 37 కోట్లు, 22 ఎయిమ్స్‌ల అభివృద్ధికి రూ. 6,835 కోట్లు, వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు, 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కోసం 13.7 లక్షల కోట్లు , 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

అసమానతలు తగ్గించే దిశగా లేదు..

ప్రజలు ఆశించినంతగా బడ్జెట్ కేటాయింపులు లేవు. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాల ప్రయోజనాల కోసం ఉపయోగపడే విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో ఆశాజనకమైన కేటాయింపులు నూతన పథకాల ప్రస్తావన లేదు. అలాగే విద్యను బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయించిన వ్యయం ఎందుకూ సరిపోదు. ఇతర దేశాల్లో వ్యవసాయ, ఆరోగ్య, రక్షణ పరిశ్రమల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంటే మనదేశంలో కోతలు విధిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి హామి పథకం కోసం కేటాయింపులు భారీగా తగ్గించారు. గ్రామీణ అభివృద్ధికి కోసం గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయి. ఆరోగ్యంపై, ఆహార సబ్సిడీలపై కేటాయింపులు పెరిగాయి. పీఎం పోషణ్‌పై గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ప్రణాళిక వ్యయం తగ్గినా, సవరించిన అంచనాల కంటే రూ. 1000 కోట్లు తక్కువ. పీఎం కిసాన్ కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ అంచనాల కంటే తక్కువ.

ఇలా తక్కువ ఆదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూరే రంగాలలో కేటాయింపులు తగ్గించి, అత్యధిక ఆదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ తయారు చేయడం బాధాకరం. జీఎస్టీ కలెక్షన్స్ పేరిట లక్షల కోట్లు వసూలు చేస్తూ, సామాన్యులు ఉపయోగించే పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించకపోవడం ఇబ్బందికరం. తలసరి ఆదాయం డబుల్ అయిందని ప్రకటించినా వాస్తవానికి సగటు భారతీయుని ఆదాయం 16, 416 రూపాయలు మాత్రమే. కానీ అదాని ఆదాయం రోజుకు రూ. 1,600 కోట్లుగా ఉంది. ఈ అసమానతలను తగ్గించే దిశగా బడ్జెట్ కేటాయింపులు లేవు. అలాగే 4 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అర్బన్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఊసేలేదు. ఎయిర్ పోర్టులు, పోర్టుల అభివృద్ధికి కేటాయింపులు ఉన్నా, సామాన్య ప్రజలు వాడే ప్రజా రవాణాలకు, అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి కోసం ఎదురుచూసే వారికి నిరాశే మిగిలింది. అలాగే వేతన జీవులకు స్వల్ప ఊరట ఇస్తూ పన్ను రాయితీ ఏడు లక్షలకు పెంచినా, ఎలాంటి మినహాయింపులు ఉండవు.

ఆ రాష్ట్రాలకే ఎక్కువ నిధులు..

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రైతే రాజు అని వట్టి మాటలు చెబుతున్న ప్రభుత్వం రైతు అభివృద్ధికి, సంక్షేమానికి, వారి ఆత్మహత్యలను అరికట్టడానికి సరైన చర్యలు చేపట్టడం లేదు. రైతు సంఘాలకు సంవత్సరం క్రితం ఇచ్చిన కనీస మద్దతు ధర చట్టం గురించి, మద్దతు ధర పెంచే అంశం గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు ఇది రైతులను విస్మరించడమే. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు, కానీ అందుకే నిధులు కేటాయించలేదు. ఇలా సామాన్య ఉద్యోగులకు, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాల ప్రయోజనాలకు ఆశించినంతగా బడ్జెట్ రూపొందించబడలేదు. 90 శాతం అసంఘటిత రంగంగా ఉన్న మన దేశంలో మహిళల ఉపాధి తక్కువగా ఉంది. మహిళల సాధికారతే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు ప్రస్తావించినా దానిలోని వాస్తవ విషయాలు మహిళా సాధికారతకు సుదూరం.

తెలుగు రాష్ట్రాల విస్మరణ

మేకిన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ద్వారా యువశక్తిని ప్రోత్సహిస్తున్నామని, సబ్కా సాత్ సబ్కా వికాస్ మా లక్ష్యం అని నిరుద్యోగుల పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభిస్తామని, పాఠశాలల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని అందమైన నినాదాలతో ప్రచారం చేస్తున్నారు, మరోవైపు ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ నమూనా బలపడే విధంగా ప్రైవేటీకరణ వైపు పరిగెత్తుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనుకోవడం హాస్యాస్పదం. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజల బాగోగుల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడకుండా, వారికి అవసరమయ్యే విధంగా బడ్జెట్ రూపొందించకుండా పెట్టుబడిదారుల కోసం, వారిని ఆకర్షించడం కోసం బడ్జెట్ రూపకల్పన చేయడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం. ఎన్నికలు ఉన్న తమ పార్టీ ప్రభుత్వాల రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి, తెలుగు రాష్ట్రాలను విస్మరించారు. విభజన చట్టంలోని హామీలలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. పాలక ప్రభుత్వాల పనితీరును ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తండ సదానందం

టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed