జూన్ త్రైమాసికంలో మైనస్ 12 శాతం వృద్ధి : యూబీఎస్ సెక్యూరిటీస్

by  |
UBS-Securities
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంలో జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థికవ్యవస్థ 12 శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేయవచ్చని ఓ నివేదిక తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అత్యధికంగా 23.9 శాతం కుదించుకుపోయిన సంగతి తెలిసిందే. సమీక్షించిన కాలంలో వినియోగదారుల సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉందని, ప్రజలు మహమ్మారి విషయంలో ఇంకా ఆందోళన చెందుతున్నారని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది.

జూన్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరిగాయని, గతేడాది స్థాయిలో కాకపోయినప్పటికీ సెకెండ్ వేవ్ అనిశ్చిత పరిస్థితులు వినియోగదారు డిమాండ్‌ను దెబ్బతీయడంతో రికవరీ నెమ్మదిగా ఉంటుందని యూబీఎస్ నివేదిక అభిప్రాయపడింది. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ ఆంక్షలు రెండున్నర నెలలు అమలు కాగా, సెకెండ్ వేవ్ సమయంలో నెల కంటే ఎక్కువ రోజుల పాటు రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేశాయి. దీనివల్ల పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలు పరిమితంగానే అనుమతించబడ్డాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, టీకా పంపిణీ ఊపందుకోవడంతో రానున్న రోజుల్లో ఆర్థికవ్యవస్థ వృద్ధి మరింత మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్టు యూబీఎస్ నివేదిక వెల్లడించింది.

Next Story