కరోనాను దాచిన ముగ్గురు… పోలీస్ కేసు

by  |
కరోనాను దాచిన ముగ్గురు… పోలీస్ కేసు
X

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా ప్రజల చెవికెక్కడం లేదు. ఈ లక్షణాలు కనిపిస్తున్నా… తమకేమీ కాదులే అనుకుంటూ స్థానిక వైద్యుల వద్ద రహస్యంగా చికిత్స తీసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆందోళన రేపుతోంది.

కత్తిపూడి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని కత్తిపూడికి ఓ వ్యక్తి వచ్చాడు. తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అతడు స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇది తెలుసుకున్న అన్నవరం పోలీసులు, వ్యాధి వుందని తెలిసినా బయటపెట్టనందుకు బాధితుడి మామ, అతడికి చికిత్స చేసిన ఆర్‌ఎంపీ, రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదు చేశారు. మరోవైపు, బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖకు తరలించారు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలంటీర్లతో రెండు సార్లు ప్రతి ఇంటా ఆరోగ్యంపై సర్వేచేయించింది. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా వలంటీర్లు ప్రశ్నించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా చెప్పాలని సూచించారు. అయినప్పటికీ గోప్యత పాటిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్ర ప్రజలకు కనువిప్పు కలిగించాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags: east godavari district, kattipudi, corona case, police case, secret checkups

Next Story

Most Viewed