తాగునీరు వృథా చేయకండి: మంత్రి హరీశ్ రావు

51
Minister Harish Rao

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని 13 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం వార్డులో పర్యటిస్తూ మోరీల్లో చెత్త, నీటి వృధా, ఆ కాలనీలో చెట్లు లేవనే అంశాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఒక ఇంటి వద్ద మున్సిపల్ నల్లా నీరు వృధాగా పోతున్న విషయం గుర్తించి నేరుగా నల్లా వద్దకు వెళ్లి ఇంటి యజమానురాలిని పిలిచి నీటి వృథాను చూపుతూ..ఇలా తాగునీటిని కరాబ్ చేయొద్దని, పైసలు పెట్టి సిద్దిపేట దాకా నీళ్లు తెస్తున్నామన్నారు. మీకు మా బాధ తెలియదని.. తెలిస్తే ఇలా వేస్ట్ చేయరంటూ హితబోధ చేశారు. నల్లా నీరు పట్టుకున్న వెంటనే దానికి మూత పెడితే సరిపోతుంది కదా తల్లీ అంటూ ఆప్యాయంగా సూచించారు. అనంతరం వార్డులో పర్యటిస్తూ సమస్యలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Minister Harish Rao

స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లపై మంత్రి అసంతృప్తి..

13వ వార్డు బీడీ కాలనీ లో పర్యటిస్తున్న క్రమంలో మొక్కలు కనిపించకపోవడంతో స్థానిక నాయకుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంతి నగర్ జడ్పీ పాఠశాల నుంచి ఇక్కడి వరకూ ఒక మొక్క లేదని, హరిత హారంలో మొక్కలు నాటాలని సూచించినా.. ఒక్క మొక్క కూడా కనపడలేదని, తిరిగి మళ్లీ ఈ ప్రాంత పర్యటనకు వచ్చేసరికి రోడ్డున ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. హరిత సిద్ధిపేట మన అందరి వల్ల సాధ్యమైతుందని స్థానిక కౌన్సిలర్ లకు సూచించారు. అనంతరం 18వ వార్డు వెంకటేష్ కళామందిర్ సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.