నకిలీ పోలీసు అరెస్టు..

by  |
నకిలీ పోలీసు అరెస్టు..
X

దిశ, సంగారెడ్డి: తాను పోలీసు అని చెప్పుకుంటూ.. వాహనాలు ఆపి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్ హనుమాన్ తండాకు చెందిన కిషన్ నాయక్ ఈనెల 9 గురువారం తన స్వగ్రామం నుంచి టీవీఎస్ ఎక్సెల్ ఏపీ 23 హెచ్‌డీ 6626 ద్విచక్ర వాహనంపై నారాయణఖేడ్‌కు వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా వచ్చి తాను పోలీసునని, డబ్బులు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానని బెదిరించి అతని వద్దనున్న రూ. 1,400 తీసుకెళ్లాడు. దీంతో బాధితుడు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసునని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్‌కోల్‌కు చెందిన శ్రీమంత సుభాష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, విచారణలో గతంలో కూడా అతడు ఇదే విధంగా వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. అయితే, నిజమైన పోలీసులు ఎవరూ కూడా డబ్బులు అడుగరని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని నారాయణ ఖేడ్ పోలీసులు సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.



Next Story