కేటీఆర్‌ చేతిలో చివరి అస్త్రం..!

by  |
కేటీఆర్‌ చేతిలో చివరి అస్త్రం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఎన్నికల ఉత్కంఠ వీడింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఓట్ల యుద్ధంలో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ట్రయల్‌గా భావించిన దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పలేదు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. దుబ్బాక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కనిపించనుంది. రాజకీయ ఉత్కంఠను కలిగించిన దుబ్బాక ఫలితాలు తేలకముందే గ్రేటర్‌లోని టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో బల్దియా కార్పొరేటర్ల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దుబ్బాక తీర్పుతో జీహెచ్ఎంసీలో రాజకీయ సమీకరణాలు పూర్తిస్థాయిలో మారనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరుస ఎన్నికల్లో గెలుపొందుతూ వస్తున్న తమకు ఇది మొట్టమొదటి ఓటమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా అంగీకరించారు. ఇదే ఒరవడి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ శక్తులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి దుబ్బాక ఎన్నికలు ఒక రెఫరెండంగా సాగాయనడంలో సందేహం లేదు. ఇందులో గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం చేసిన శ్రమ ఫలితమివ్వలేదు. సీఎం కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి శక్తులన్నీ దుబ్బాక ఎన్నికల క్షేత్రంలో పనిచేసినా ఓటమి మూటకట్టుకోక తప్పలేదు. ఇక గ్రేటర్‌లోనూ ఇప్పటికే అధికార పార్టీ నేతలపై ప్రజలు అగ్రహంతో ఉన్నారు. మరో వైపు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలు ఇచ్చినప్పటికీ ఉప ఎన్నిక ఫలితం అగ్ర నాయకత్వానికి, టీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఒక రకమైన భయాన్ని తెచ్చిపెట్టంది.

బీజేపీలో మరిన్ని చేరికలు
దుబ్బాక ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఓ వైపు గెలుపోటములపై చర్చ జరుగుతుండగానే.. నగరంలో బీజేపీలో చేరికలు ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా కండువాలు కప్పి టీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, సభ్యులు అనురాధ సహా పలువురు టీఆర్ఎస్ అగ్ర నాయకులు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. మైలార్ దేవ్ పల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి సైతం బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికే నగరంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్లలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇక గెలుపు తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో మరిన్ని చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

గ్రేటర్‌లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదా..
ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ ఓటమి ఖాయమనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద సాయం తదితర అంశాల్లో ప్రజల నుంచి సిట్టింగ్ కార్పొరేటర్లపై పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆపదలో తమను ఆదుకోలేకపోవడమే గాక, తమకు అందాల్సిన పరిహారాన్ని సైతం పంచుకున్నారని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెల రోజుల్లోనే ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఉన్న అసహనం ఓట్ల రూపంలో వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు టీఆర్ఎస్ అంతర్గత సర్వేలో తేలిన అంశాలు మరింత భయం కలిగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 35 మంది కార్పొరేటర్లు కచ్చితంగా ఓడిపోతారని స్పష్టమైన నిర్ధారణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. వీరికి తోడు కొత్తగా వరదల సమయంలో కూడా ప్రజలకు మొహం చూపించని కార్పొరేటర్లు సైతం చేరిపోయారు. వీరందరిని కలుపుకుంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్లలో 50% మంది రాజకీయ ప్రతిపక్షం లేకుండానే ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

ముందస్తు ఎన్నికలు లేనట్టే..!
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ వేగంగా ముందుకెళ్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఓటర్లపై దుబ్బాక ఉప ఎన్నికల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. వరద సాయం పంపిణీ అనుకున్న ఫలితాలనివ్వకపోగా వ్యతిరేకతను పెంచింది. వరద బాధితులు తమ ఆవేదనలో మంత్రి కేటీఆర్‌నే పక్కకు నెట్టేశారు.. ఇక తమను ఎలా సత్కరిస్తారోనని సిట్టింగ్ కార్పొరేటర్లు గుబులు పడుతున్నారు. పర్యవసానాలకు భయపడి కూడా కొందరు బీజేపీలో చేరుతన్నట్టు సమాచారం. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహిస్తారని అందరూ భావించినా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అయితే కర్ణుడిచావుకు వంద కారణాలు అన్నట్టు షెడ్యూల్డ్ ఎన్నికలు టీఆర్ఎస్ ఓటమిని దాదాపు ఖరారు చేసినట్టేనని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించొద్దని చేర్చిన కొత్త జీహెచ్ఎంసీ నిబంధన రూపంలో కేటీఆర్‌ చేతిలోనే చివరి అస్త్రం ఉందనడంలో సందేహం లేదు.

Next Story

Most Viewed