ముగిసిన దుబ్బాక ఎన్నికల ప్రచారం

by  |
ముగిసిన దుబ్బాక ఎన్నికల ప్రచారం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఎన్నికల ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఇన్నిరోజులు ప్రచారాన్ని హోరేత్తించాయి. కరోనా సమయంలోనూ ఇంటింటికి తిరుగుతూ, ర్యాలీలు తీస్తూ, ప్రచార రథాల్లో పర్యటిస్తూ కొత్త కొత్త ప్రసంగాలతో దుబ్బాక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొన్ని అడపా, దడపా ఘటనలు చేసుకున్నా.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రచారం సమయం ముగిసినందున ప్రస్తుతం నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈనెల 3వ తేదీన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. బై పోల్‌లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.

ఈనెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, దుబ్బాక నియోజకవర్గం పరిధిలో లక్ష 98వేల 756 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపఎన్నిక కోసం దుబ్బాకలో ఇప్పటికే 315 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అయితే, నియోజకవర్గంలో 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉపఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed