గురువారం నుంచి రాష్ట్రమంతా ‘డ్రై రన్’

by  |
గురువారం నుంచి రాష్ట్రమంతా ‘డ్రై రన్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా వెంటనే ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సకల ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక విడత ‘డ్రై రన్’ను విజయవంతంగా పూర్తి చేసుకోగా గురువారం, శుక్రవారాల్లో రాష్ట్రంలోని మొత్తం వెయ్యి కేంద్రాల్లో ఫిజికల్‌గా మరోమారు ‘డ్రై రన్’ నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ వేయడంపై వైద్యారోగ్య సిబ్బందికి, నర్సులకు, ఏఎన్ఎంలకు, ‘ఆశా’ వర్కర్లకు ఇప్పటికే వర్చువల్‌లో శిక్షణ పూర్తయింది. ఉన్నతాధికారుల్లో సైతం ఎంపిక చేసిన 250మందికి మొదటి దశ శిక్షణ పూర్తయింది. ఇక మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు మరో విడత శిక్షణ జరగనుంది. శిక్షణ అందుకోనున్న వీరంతా గ్రామ స్థాయిలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చే ట్రెయినర్లు.

అన్ని జిల్లాల వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, ఇమ్యునాలజీ నిపుణులు సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఉదయం మొదలు రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరాటంకంగా ఎలా పూర్తిచేయాలి, ఎలాంటి సౌకర్యాలను కేంద్రాల్లో కల్పించాలి, సిబ్బంది పని విభజన, వారికి అవసరమైన శిక్షణ, సిద్ధంగా ఉంచుకోవాల్సిన వైద్య ఉపకరణాలు, సిరంజీలు.. ఇలా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామస్థాయిలోని వ్యాక్సినేషన్ కేంద్రం వరకు ఒకే తరహా ప్రమాణాలను, మార్గదర్శకాలను పాటించే విధంగా ఉన్నతాధికారులు అవగాహన కలిగించారు.

రెండు రకాల వ్యాక్సిన్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని లాంఛనంగా ప్రారంభించడమే మిగిలిందని, వారం రోజుల వ్యవధిలో వ్యాక్సిన్ డోస్‌లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌ను వాడి అందులో పేర్లను నమోదుచేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి ఉన్నందున ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఫ్రీజర్లు, ఐస్ కోల్డ్ రిఫ్రిజిరేటర్లు లాంటి కోల్డ్ చైన్ సిస్టమ్‌ను సమకూర్చుకోవడం, సైడ్ ఎఫెక్టులు వచ్చినట్లయితే వెంటనే అందుబాటులో ఉండేలా డాక్టర్లను, అంబులెన్సులను రెడీగా ఉంచుకోవడం.. ఇలాంటి అన్ని అంశాలను రెండు రోజుల పాటు జరిగే ‘డ్రై రన్’లో పరిశీలిస్తారు.

రాష్ట్రంలో సుమారు 2.90లక్షల మంది వైద్య సిబ్బంది, నలభై వేలకు పైగా పోలీసులు, పాతిక వేల మంది పారిశుద్య సిబ్బంది, మరికొద్దిమంది రెవెన్యూ సిబ్బంది తొలి విడతలోనే వ్యాక్సిన్లు వేయించుకోనున్నారు. ఇప్పటికే వీరందరి పేర్లు ‘కొవిన్’ సాప్ట్‌వేర్‌లో అప్‌లోడ్ అయ్యాయి. రాష్ట్ర కోల్డ్ స్టోరేజీ పాయింట్ కోఠిలో ఏర్పాటుకాగా వివిధ జిల్లా కేంద్రాల్లో మరికొన్ని ఏర్పాటయ్యాయి. ఒకసారి వాడిన తర్వాత దానంతట అదే నిర్వీర్యమైపోయే ప్రత్యేక రకం సిరంజీలు కూడా ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన షెడ్యూలు, మార్గదర్శకాల ప్రకారం వాటిని లబ్ధిదారులకు ఇవ్వడమే మిగిలింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed