ధాన్యం కొనమంటే దొంగ నాటకాలాడుతున్నారు

69
TPCC Chief Revanth Reddy

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్​లో కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాష్ రావ్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి రేవంత్​రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అని, అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రజలకు తాగడానికి, రైతులకు సాగుకు నీళ్లు ఇవ్వరని, భూ నిర్వాసితులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్​ మోసం చేశాడని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా మోసం చేసిన ద్రోహి కేసీఆర్​ అని, పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కేసీఆర్​కు లేదన్నారు. హైదరాబాద్​లో ఇప్పటికి కూడా ఏ అడ్డ మీద చూసిన పాలమూరు బిడ్డలే  కూలీలుగా  ఉన్నారని, పాలమూరు బిడ్డలు ఐఏఎస్ , ఐపీఎస్ లు కావద్దా అని, ఇంకా బానిసలుగానే బ్రతకాలా అని ప్రశ్నించారు.

కొల్లాపూర్ లో కాంగ్రెస్​ను గెలిపిస్తే ఆ సన్నాసి కాంగ్రెస్​ను, ప్రజలను మోసం చేసి కేసీఆర్ దగ్గర గులాం గిరి చేస్తున్నాడని రేవంత్​రెడ్డి విమర్శించారు. వనపర్తి నుంచి గెలిచి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గుడిని గుడి లింగాన్ని దోచేవాడని, నోట్ల కట్టలు లేనిదే నిరంజన్ రెడ్డి ఏ పని చేయడని ఆరోపించారు. కృష్ణ పుష్కరాల్లో వేసిన సీసీ రోడ్లలో కూడా నిరంజన్ రెడ్డి కమీషన్లు తీసుకున్నాడని రేవంత్​రెడ్డి విమర్శించారు. వరి రైతులకు ఉరి అని కేసీఆర్ అంటున్నాడని, టీఆర్ఎస్​, బీజేపీ కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయని, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చంపడానికే టీఆర్ఎస్​, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని, తెలంగాణ, రైతు ద్రోహి కేసీఆర్​ అని విమర్శించారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు మూడు లక్షలు ఇస్తానని కేసీఆర్​ అంటున్నాడని, కేసీఆర్​ పాలనలో ఇప్పటి వరకు 67 వేల మంది రైతులు చనిపోయారని, ఇక్కడ చనిపోయిన రైతులకు ఏం ఇవ్వలేదని, ఇదేం న్యాయం అని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

ఈ నెల 27  నుంచి వరి దీక్ష

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్​ పోరాటానికి దిగుతుందని, ఈ నెల 27, 28 తేదీల్లో వరి దీక్ష చేస్తున్నట్లు రేవంత్​రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ దగ్గర రైతులతో కలిసి దీక్ష చేస్తామన్నారు. ఈ వరి దీక్షకు పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీలో చేరిన అభిలాష్​ రావు మాట్లాడుతూ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్​లో చేరడం లేదని, కాంగ్రెస్​ సిద్ధాంతమే తన సిద్ధాంతమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి  తదితరులు ఉన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..