‘ఆరోగ్యంగానే ఉన్నా మెంటల్ మందులు ఇస్తున్నారు’

by  |
‘ఆరోగ్యంగానే ఉన్నా మెంటల్ మందులు ఇస్తున్నారు’
X

దిశ, ఏపీ బ్యూరో: వారం రోజుల క్రితం నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచికట్టి కేజీహెచ్‌కు తరలించి, గంటల్లోనే తనకు మానసిక సమస్యలు ఉన్నాయని చెబుతూ విశాఖ మానసిక ఆసుపత్రికి తనను తరలించారని ఎనస్థటిస్టు డాక్టర్ సుధాకర్.. ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆ లేఖలో డాక్టర్ సుధాకర్ వాపోయారు. తన పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి రెఫర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మాస్కుల వివాదం సహా అన్ని విషయాలను ఆ లేఖలో సవివరంగా రాసుకొచ్చారు. ఇది మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై డాక్టర్ సుధాకర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడి మానసిక స్థితి బాగాలేకపోతే లేఖ ఎలా రాస్తాడని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్‌కి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళితులని చులకనభావం చూపించడం సరికాదని ఆమె హితవు పలికారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని అన్నారు. తన కుమారుడి కేసు టేకప్ చేసిన న్యాయవాది శ్రావణ్ కుమార్‌పై కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. ఇది ప్రభుత్వమేనా? మాస్కులు అడిగినందుకు ఇంతలా కక్షసాదింపా? అని ఆమె ప్రశ్నించారు.

Next Story

Most Viewed