తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. ఉత్కంఠ రేపిన ‘డౌట్ క్రియేట్‌’..!

by  |
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం.. ఉత్కంఠ రేపిన ‘డౌట్ క్రియేట్‌’..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీఆర్‌ఎస్​మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటికే డ్రగ్స్​అంశంలో విసిరిన వైట్​చాలెంజ్​కోర్టుకెక్కింది. దీనిపై అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి కొంత సైలెంట్​గానే ఉన్నా.. మళ్లీ నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. ఇరు పార్టీల నేతలు హుజూరాబాద్‌ ​బై ఎలక్షన్స్ ప్రచారంలో విమర్శలకు దిగుతుంటే.. రాష్ట్ర రాజధానిలో అధినేతలు సవాళ్లకు దిగుతున్నారు. దీంతోపాటుగా ఆయా పార్టీల్లోనే నేతలపై అనుమానాలు వ్యక్తమయ్యేలా విమర్శలు చేసుకుంటున్నారు. హరీశ్​రావును బయటకు పంపించే ప్లాన్ చేస్తున్నారని రేవంత్​రెడ్డి అంటే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను త్వరలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారంటూ మంత్రి కేటీఆర్​వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మంత్రి వెనకేసుకు రావడం మరింత ఆజ్యం పోసినట్లైంది.

అటు కేటీఆర్.. ఇటు రేవంత్​

రాష్ట్రంలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక హాట్​టాపిక్‌గా ఉంటే.. తాజాగా కేటీఆర్, రేవంత్​రెడ్డిల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మంగళవారం ఇరువురు నేతలు రచ్చకెక్కారు. కొంతకాలం కిందట వరకు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ఉన్నట్లు ఉండే అధికార పార్టీ నేతలు ఇప్పుడు వెంటనే ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రి కేటీఆర్​ కూడా అదే పంథా ఎంచుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పెద్దగా స్పందించని మంత్రి కేటీఆర్​.. ఇటీవల రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం వెంటనే విరుచుకుపడుతున్నారు. గతంలో డ్రగ్స్​చాలెంజ్‌లో ఏకంగా కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

తాజాగా మంగళవారం మరోసారి ఇరువురూ రెచ్చిపోయారు. అంతకు ముందు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి.. మంత్రి హరీశ్​రావును టార్గెట్​చేసి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేటీఆర్​కూడా రేవంత్​రెడ్డిని ఫోకస్​చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మధ్యలో ఇరికించారు. అదే సమయంలో హస్తం నేతల్లో ఆందోళన కల్గించేలా భట్టి విక్రమార్కను మెచ్చుకుంటూ ఆయా పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. దీంతో అటు భట్టి కూడా ఎలాంటి రిప్లై ఇవ్వాలో సందిగ్థంలో పడిపోయినట్లు అవుతోంది. అయితే దీన్ని కొట్టిపారేస్తున్నట్లే రేవంత్​రెడ్డి సైతం మళ్లీ తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ఓ జూనియర్​అంటూ తనతో ఎక్కడా పోటీ కాదంటూ మాట్లాడారు. ఏ విషయమైనా బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్​ విసిరారు. ఈ సవాల్‌ను కేటీఆర్​ఎంత మేరకు స్వీకరిస్తారో చూడాల్సిందే.

హుజూరాబాద్ టూ హైదరాబాద్​

మరోవైపు హుజూరాబాద్‌లో నేతలు.. హైదరాబాద్‌లో అధినేతల కొట్లాట అనే తీరుతో రాజకీయం సాగుతోంది. హుజూరాబాద్​ఉప ఎన్నికలో ప్రచారపర్వం ఊపందుకున్న సమయంలో టీఆర్‌ఎస్​నుంచి మంత్రులు, పార్టీ నేతలు అక్కడే మకాం వేశారు. బీజేపీ నేతలు కూడా అక్కడే ఉన్నారు. కొంత ఆలస్యంగానైనా కాంగ్రెస్​పార్టీ నుంచి సీనియర్లు మొత్తం హుజూరాబాద్‌లోనే తిష్ట వేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్, సీనియర్​నేతలు దామోదర రాజనర్సింహా, పొన్నం, మధుయాష్కీ, సీతక్క, శ్రీధర్​బాబు వంటి నేతలంతా హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో ఉండి విమర్శలతో కాక పుట్టిస్తున్నారు.

సెల్ఫ్​ గోల్​ప్లాన్​..?

ఇరు పార్టీలో నేతలను సెల్ఫ్​గోల్‌లో పడేసే ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి ముందుగా రేవంత్​రెడ్డి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు అంటూనే మంత్రి హరీశ్​రావును.. ఈటల రాజేందర్​తరహాలోనే బయటకు పంపే ప్లాన్​నడుస్తుందని, హుజూరాబాద్​ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు కాకుండా ఈటల రాజేందర్​ కోసం పని చేశారనే ముద్ర వేసి, పార్టీ నుంచి మెడపట్టి బయటకు పంపిస్తారంటూ రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ కూడా అదేస్థాయిలో కౌంటర్​ ఇచ్చారు. ఈటల, వివేక్​ వంటి నేతలు కాంగ్రెస్‌కు వస్తారంటూనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మధ్యలోకి లాగారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోని చాలా మంది సీనియర్లు కేసీఆర్‌కు కోవర్టులు అనే ప్రచారం ఎక్కువగా ఉన్న సమయంలో ఇప్పుడు కేటీఆర్​అనూహ్యంగా భట్టిని వెనకేసుకురావడం పార్టీలో అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టే.


Next Story