అమెరికా దుస్థితికి ట్రంపే కారణం.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

by  |
అమెరికా దుస్థితికి ట్రంపే కారణం.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
X

వాషింగ్టన్: కరోనా కారణంగా అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ నగరానికికే పరిమితమయ్యేలా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కాని అదే సమయంలో వైరస్ దేశంలో ప్రవేశించిందని తెలిసి కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత నిర్లక్ష్యం వహించడం వల్లే ఇవాళ అమెరికా ఈ దుస్థితికి చేరిందని ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెలువరించింది. కరోనా తొలి కేసు నమోదైన ప్రారంభ దశలోనే ఇంటెలిజెన్స్, భద్రతా వర్గాలతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు కూడా దాని ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే వైరస్ వ్యాప్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్ దృష్టికి తీసుకొని వెళ్లారు. కాని డొనాల్డ్ ట్రంప్ వారి మాటలను పెడచెవిన పెట్టారని ఆ పత్రిక వెల్లడించింది. కరోనా కారణంతో దేశమంతా లాక్‌డౌన్ విధిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని.. దాంతో అగ్రరాజ్యం అనే హోదా కోల్పోవల్సి వస్తుందని ట్రంప్ భావించినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. అందుకే అమెరికాలో తొలి కేసు నమోదైన ఆరు వారాల తర్వాత అన్ని వైపుల నుంచి ఒత్తిడులు రావడంతో లాక్‌డౌన్ ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ఈ ఏడాది మొదట్లోనే ట్రంప్ ముఖ్య వాణిజ్య సలహాదారు పీటర్ నువారో ఒక లేఖ రాశారు. కరోనా వైరస్ ఎంత భయంకరంగా మారబోతోందో ఆ లేఖలో వివరించారు. ఈ వైరస్ కారణంగా ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అమెరికా చూడబోతోందని.. అదే విధంగా దేశ జనాభాలో 30 శాతం మంది ఈ కరోనా బారిన పడబోతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు లక్షలాది మంది ఈ కరోనా కారణంగా మరణిస్తారని ఆయన హెచ్చరించారు. కాగా, ట్రంప్ అమెరికా కోల్పోయే ట్రిలియన్ డాలర్ల గురించే పట్టించుకున్నారు తప్ప ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాల గురించి ఆలోచించలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ తీసుకునే చర్యల వల్ల వైట్‌హౌస్‌లో పని చేసే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారని.. ట్రంప్ తన ప్రజారోగ్య సలహాదారుడిని పక్కన పెట్టి కరోనా బాధ్యతలన్నీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అప్పగించడం కూడా వైట్‌హౌస్‌లో వివాదానికి దారి తీసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇప్పుడు వైరస్ మరింతగా విజృంభిస్తున్న సమయంలో అందరినీ కలుపుకొని పోదామని ట్రంప్ చూస్తున్నా.. అతని అలసత్వం, మొండితనం చూసిన వాళ్లు ఆయనతో పని చేయడానికి ఉత్సహం చూపట్లేదని పత్రిక పేర్కొంది. దీంతో ట్రంప్ అందిరినీ కలుపుకోలేక.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయలేక చైనాపై, డబ్ల్యూహెచ్‌వోపై తన అసహనాన్ని చూపుతున్నట్లు పత్రిక పేర్కొంది. ఇక కరోనాను దేశ విపత్తుగా ఒకే సారి ప్రకటించకుండా.. రాష్ట్రాల వారీగా ప్రకటిస్తూ రావడం కూడా ఆయా రాష్ట్రాలకు నష్టదాయకంగా మారిందని పత్రిక పేర్కొంది. ఇలా ట్రంప్ అన్ని దశల్లో కరోనా కట్టడిపై విఫలం కావడం వల్లే ప్రపంచంలో అత్యధిక పాజిటీవ్ కేసులు, అధిక మరణాలు అమెరికాలో నమోదయ్యాయని పేర్కొంది.

tags: donald trump, america president, cause, bad situation

Next Story

Most Viewed