రేపటి నుంచి జిల్లా బులెటిన్లు బంద్

by  |
రేపటి నుంచి జిల్లా బులెటిన్లు బంద్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత పాజిటివ్‌గా తేలినవారి సంఖ్యను ప్రతీ జిల్లాలో వైద్యారోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్ఓ) ఏరోజుకారోజు బులిటెన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇకపైన ఆ విధానానికి స్వస్తి పలకాల్సిందిగా హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల బులిటెన్లలో వస్తున్న గణాంకాలకు రాష్ట్ర స్థాయిలో ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ కార్యాలయం విడుదల చేస్తన్న బులిటెన్లలోని గణాంకాలకు మధ్య వ్యత్యాసం ఉండడం విమర్శలకు తావిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఉత్తర్వుల రూపంలో కాకుండా మౌఖికంగా ఈ ఆదేశాలు వెళ్తున్నాయి. దీంతో మంగళవారం నుంచే జిల్లా బులిటెన్ల విడుదలకు అధికారులు మంగళం పాడనున్నారు.

జిల్లాల్లో డీఎంహెచ్ఓలు సాయంత్రంకల్లా తాజాగా నమోదైన గణాంకాలను వెల్లడిస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో బులిటెన్ రాత్రి పది గంటలకు విడుదలవుతున్నా ఆ గణాంకాలు చోటుచేసుకోవడంలేదు. జిల్లాల్లోని కరోనా కేసుల లెక్కలకు, రాష్ట్రస్థాయి లెక్కలకు పొంతన కుదరడంలేదు. ఫలితంగా వైద్యారోగ్య శాఖ విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. దీన్ని చక్కదిద్దుకోడానికి బదులుగా జిల్లాల బులిటెన్ల విడుదల ప్రక్రియనే నిలిపివేయాలన్న నిర్ణయం జరిగింది. ప్రతీరోజు ఏదో ఒక జిల్లాకు సంబంధించిన గణాంకాల విషయంలో విమర్శలు వస్తుండడం అధికారులకు తలొనొప్పిగా మారింది. ఒకవైపు జిల్లాలవారీ గణాంకాలను కలెక్టర్లు వెల్లడించాలని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించినా గంటల వ్యవధిలోనే హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు ఈ మౌఖిక ఆదేశాలు వెళ్ళడం గమనార్హం.



Next Story

Most Viewed