మొద్దు నిద్రలో అధికారులు.. వందమంది భూమి ఆక్రమణ

by  |
venture land occupied
X

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ మండలం కొరేముల రెవెన్యూ పరిధి ఏకశిల నగర్‌లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. 1987లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసిన వెంచర్ అనుకొని, అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ప్రస్తుతం పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం అధికారుల, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా.. న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో న్యాయ, పోలీస్, అధికారులు, మీడియా ఇన్ని ఉన్నా, అన్నిటినీ తోసి అక్రమార్కులు రాజ్యాన్ని చేతిలోకి తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

7.20 ఎకరాలు కబ్జా

కొరేముల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 739 నుండి 749 లోని 149 ఎకరాల్లో 1987లో ఏకశిలా నగర్ పేరుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్ చేశారు. దీంతో ప్రభుత్వ వెంచర్ కదా అని ధీమాతో అనేకమంది ఇందులో ప్లాట్లు కొనుగోలు చేశారు. అప్పటినుండి ఇప్పటి వరకు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. గ్రామ సర్పంచ్, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి అండతో ఈ తతంగం నడిపిస్తున్నారు అని సమాచారం. ఇందుకు గాను వీరికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు వినికిడి. ప్రజాప్రతినిధుల అండతో 7.20 ఎకరాల భూమిపై కన్నేసిన కబ్జాదారులు గతంలో వెంచర్ చేసిన వ్యక్తితో చేతులు కలిపి, భూమిని అమ్మినట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారు. అంతేగాకుండా… సదరు భూమికి చుట్టు ప్రహరీ గోడను నిర్మించారు. ఇందులో కొనుగోలు చేసిన వందమంది ప్లాట్ల యజమానులు ఇదేమని అడిగితే అసలు ఓనర్లం మేమే, మీది చెల్లదు అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని యజమానులు వాపోయారు.

కోర్టు తీర్పు బేఖాతరు

భూమి ఆక్రమణకు గురైందని బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వాదోపవాదాలు విని ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పుచెప్పింది. అయినా, జాగా ఖాళీ చేయకుండా ఆక్రమణ దారులు మొండి కేస్తున్నారు. విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో, జిల్లా కలెక్టర్, తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శికు ఫిర్యాదు చేశారు. అయినా న్యాయం జరగడం లేదని యజమానులు అంటున్నారు. మా గోడు ఎవరికీ చెప్పుకోవాలని వాపోతున్నారు. పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాటు విలువ పెరిగిన తర్వాత అన్యాయంగా లాక్కుంటే ప్రజాస్వామ్య దేశంలో మాకు న్యాయం జరగదా? అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వం హయాంలో అక్రమాలు పెరిగినాయి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్రంలో భూముల విలువలు పెరిగినాయి. ఇదే అదునుగా భావించిన కొందరు స్థిరాస్తి వ్యాపారులు, స్థానిక నాయకులతో చేతులు కలిపి అక్రమ దందాలు చేస్తున్నారు. విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినం, కోర్టులో పిటిషన్ వేస్తే ప్లాట్ యజమానులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. విషయంపై ఉన్నతాధికారులు నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. – మద్దినేని సుభాష్ చంద్ర బోస్, కొండాపూర్, హైదరాబాద్

ఇదెక్కడి న్యాయం : విశ్వనాథ్, బొడుప్పల్

విస్తరిస్తున్న విశ్వనగరంలో ఇంటి స్థలం కొంటె భవిష్యత్లో ఉపయోగపడుతుందని భూమి కొనుగోలు చేశాను. అప్పటినుండి ఆ భూమి నా ఆధీనంలోనే ఉంది. నగర శివార్లలో భూముల విలువలు పెరగటంతో ఈ భూమిపై కన్నేసిన కొందరు ఆక్రమణ దారులు హద్దు రాళ్ళను చెడగొట్టి, ప్రహరీ నిర్మించారు. అదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని వాపోయాడు.

Next Story

Most Viewed