కోట్లు దానం చేసిన రీల్ విలన్..

by  |
కోట్లు దానం చేసిన రీల్ విలన్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

రీల్ విలన్.. రియల్ హీరో అయ్యాడు. నటనతో భయపెట్టిన వ్యక్తి.. ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు. సినీ కార్మికుల కష్టాలు చూసి చలించిపోయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 500 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేశాడు. సొంత ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించమని సూచించాడు. ఆ విధంగా హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీ వెలిసేందుకు కారణమయ్యాడు. ఆయనే అలనాటి లెజెండరీ యాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి. అప్పట్లో చాలా మంది నటులు స్థలాలు కొని ఇళ్లు కట్టుకుంటే.. తను మాత్రం స్థలం కొని దానం చేశాడు. దేవుడిగా కీర్తించబడ్డాడు.

నల్గొండ జిల్లా, తుంగతుర్తిలో 1935, అక్టోబర్ 8న జన్మించిన ఆయన చేసిన గొప్ప పనిని స్మరించుకుంటూ నివాళులు అర్పించింది చిత్రపురి. ఆయన జ్ఞాపకార్థం ఆ కాలనీకి డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చిత్రపురిగా పేరు పెట్టుకుని ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. డాక్టర్ చదివిన ఎం. ప్రభాకర్ రెడ్డి నటనపై ఆసక్తితో యాక్టర్ అయ్యారు. ఎన్టీఆర్ కాలంలో గొప్ప నటుడిగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న ఈ జమీందారీ కుటుంబానికి చెందిన మహానుభావుడు.. 1960లో ‘చివరకు మిగిలేది’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1991 అల్లుడు దిద్దిన కాపురం ఆయన చివరి చిత్రం కాగా.. 31 ఏళ్ల సినీ ప్రస్థానంలో 470కి పైగా సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ప్రభాకర్ రెడ్డికి అవార్డులు శిరస్సు వంచగా.. అటు హిందీ, తమిళ్ చిత్రాల్లోనూ కనిపించారు. 1980లో ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్న ఆయన.. 1981లోనూ పల్లె పిలిచింది సినిమాకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం పొందారు. ఆ తర్వాత 1990లో వచ్చిన ‘చిన్న కోడలు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నందితో సత్కరించబడ్డారు. ఉత్తమ కథా రచయతగాను ‘గృహ ప్రవేశం, గాంధీ పుట్టిన దేశం’ చిత్రాలకు నంది అందుకున్నారు ప్రభాకర్ రెడ్డి.

అయితే 1997 నవంబర్ 26న తుది శ్వాస విడిచిన ప్రభాకర్ రెడ్డికి దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదని చెప్తుంటారు ఆనాటి తన తోటి నటులు, ఆయన ద్వారా సహాయం పొందిన సినీ కార్మికులు.

Next Story

Most Viewed