2025 నాటికి భారత్‌లో 72 శాతానికి డిజిటల్ చెల్లింపులు!

by  |
2025 నాటికి భారత్‌లో 72 శాతానికి డిజిటల్ చెల్లింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే కొన్నేళ్లలో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతాయని, 2025 నాటికి భారత్‌లో ఇవి 71.7 శాతం వాటాను కలిగి ఉంటాయని బుధవారం ఓ నివేదిక తెలిపింది. నగదు, చెక్కులు, ఇతర చెల్లింపులు 28.3 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంటాయని ప్రముఖ కార్పొరేషన్ చెల్లింపుల్లో పరిష్కారాలను అందించే ఏసీఐ వరల్డ్‌వైడ్ తెలిపింది. 2020లో 2,550 కోట్ల రియల్ టైమ్ చెల్లింపులతో భారత్ చైనా కంటే ముందంజలో ఉందని ఏసీఐ వరల్డ్‌వైడ్ నివేదిక స్పష్టం చేసింది.

2020లో మొత్తం చెల్లింపుల్లో తక్షణ చెల్లింపు 15.6 శాతం వాటాను కలిగి ఉండగా, ఎలక్ట్రానిక్ చెల్లింపులు 22.9 శాతం, పేపర్ ఆధారిత చెల్లింపు 61.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025 నాటికి ఈ చెల్లింపులు భారీగా పెరుగుతాయని, తక్షణ చెల్లింపు 37.1 శాతానికి, ఎలక్ట్రానిక్ చెల్లింపు 34.6 శాతానికి పెరుగుతాయని, నగదు, పేపర్ ఆధారిత చెల్లింపు 28.3 శాతానికి తగ్గిపోవచ్చని నివేదిక పేర్కొంది. మొత్తంగా ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో రియల్ టైమ్ చెల్లింపుల వాటా 2024 నాటికి 50 శాతానికి మించి ఉంటాయని అభిప్రాయపడింది.

భారత్‌లో ప్రభుత్వం, రెగ్యులేటరీ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సహకారం మెరుగ్గా ఉంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడుతుందని, ముఖ్యంగా ప్రజల్లో వేగవంతమైన చెల్లింపుల డిజిటలైజేషన్ అందించిందని ఏసీఐ వరల్డ్‌వైడ్ వైస్-ప్రెసిడెంట్ కౌశిక్ రాయ్ వెల్లడించారు.

Next Story