టైం టేబుల్ 2.0.. ‘ఆన్‌లైన్’ సమస్యలు పక్కకు?

by  |
టైం టేబుల్ 2.0.. ‘ఆన్‌లైన్’ సమస్యలు పక్కకు?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్ లైన్ బోధన ప్రహసనంలా మారింది. డిజిటల్​ బోధన వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొదటి విడతగా ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్ లైన్ తరగతుల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా మలి విడత టైం టేబుల్ ఈ నెల 15 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రకటించినప్పటికీ బోధన సమయంలో వచ్చే సమస్యలపై దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంగ్లీష్​ మీడియంలో..

మొదటి విడత ప్రభుత్వం ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. కాగా తాజాగా ప్రకటించిన మరో రెండు వారాల షెడ్యూల్ లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సైతం తరగతులు బోధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతిరోజూ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీడీ యాదగిరి, టీ శాట్ న్యూస్ చానెళ్లలో నిర్వహించే డిజిటల్ తరగతుల విషయమై సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవసేన రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వాట్సప్ లో వర్క్ షీట్లు…

ఆన్ లైన్ తరగతులు వినే విద్యార్థులందరినీ కలిపి ఉపాధ్యాయులు వాట్సప్ గ్రూపు తయారు చేసి వారి అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు జరిగిన పాఠాల మూల్యాంకనం వర్క్ షీట్లు వాట్సప్ గ్రూపుల్లో పెట్టి విద్యార్థులు వాటిని పూర్తి చేసి తిరిగి గ్రూపుల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలి. అయితే పలు రకాల కారణాలతో ఇవి ఆచరణలో సాధ్యం కావడం లేదు. స్మార్ట్​ఫోన్లు లేకపోవడం, తరగతులు కొనగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడం వంటివి ప్రధాన సమస్యలుగా తయారయ్యాయి.

నెట్ వర్క్ సమస్య..

ఆన్ లైన్ పాఠాలు వినే విద్యార్థులకు ఇంటర్నెట్ ప్రధాన సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ అందక పోవడం, అందినా అవసరాల మేరకు స్పీడ్ లేకపోవడంతో విద్యార్థులకు పాఠాలు వినడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వారు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి తాము పాఠాలు వినలేకపోతున్నామని చెబుతున్నారు. అయితే ఏం చేయాలో ఉపాధ్యాయులకు సైతం అర్థం కావడం లేదు.


Next Story

Most Viewed