‘పల్లెప్రగతి’పై డీజిల్ ధర ఎఫెక్ట్.. ట్రాక్టర్లు, జేసీబీల అద్దెల పెంపు

by  |
palle-pragathi 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్న ‘పల్లెప్రగతి’పై డీజిల్ ధర పెరుగుదల ప్రభావం చూపించింది. రెండేళ్ళ క్రితం ఫిక్స్ చేసిన ధరలు ఇప్పుడు గిట్టుబాటుకావంటూ అద్దెకు ఇవ్వడానికి క్రేన్‌లు, జేసీబీ (ఎర్త్ మూవర్), ట్రాక్టర్, బుల్‌డోజర్ లాంటి వాహనాల యజమానులు సుముఖంగా లేరు. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా కొత్త ధరలను నిర్ణయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో గ్రామ పంచాయతీ మొదలు జిల్లా కలెక్టర్ స్థాయి వరకు చర్చలు జరిగాయి. చివరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ దీనిలో జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త అద్దె ఛార్జీలను నిర్ణయించాలని తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. దీంతోపాటు కొన్ని మార్గదర్శకాలను కూడా నొక్కిచెప్పారు.

గ్రామాల్లో పాడుబడిన బావులను పూడ్చడం, నీరు నిలిచిపోయే ప్రాంతాలను మట్టితో పూడ్చడం, పిచ్చిమొక్కలను తొలగించడం, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను నేలమట్టం చేయడం.. ఇలాంటి అనేక పనులకు జేసీబీ, ట్రాక్టర్లను వాడాల్సి వస్తుందని, ఆయా పనులకు తగినట్లుగా ఇలాంటి యంత్రాలను సమకూర్చుకోడానికి జిల్లా కలెక్టర్లే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. డీజిల్ ధర పెరిగినందువల్ల వీటి అద్దె కూడా పెరిగినట్లు సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, మంత్రుల వరకు విజ్ఞప్తి చేశారని శరత్ గుర్తుచేశారు. నిర్దిష్టంగా మార్గదర్శకాల ప్రకారం పనులు చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు.

  • పల్లెప్రగతి పనుల్లో ఎక్కడెక్కడ యంత్రాలను వాడాల్సి ఉంటుందో పంచాయతీ కార్యదర్శి ఆలోచించి ప్రతిపాదనలను తయారుచేయాలి.
  • గ్రామ పంచాయతీ అనుమతి కోసం కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రతిపాదనలను ప్రజలకు వివరించి సభ అనుమతి పొందాలి.
  • గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఏ పనులూ చేపట్టరాదు.
  • పనులు జరగడాని ముందు, జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత వేర్వేరు ఫోటోలను తీసుకోవాలి.
  • ఈ పనులను పంచాయతీరాజ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ నమోదు చేసి డిప్యూటీ ఇంజనీర్ ఆమోదం కోసం పంపాలి.
  • ఆ తర్వాతనే యంత్రాల వినియోగానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు జరగాలి.
    నిర్దిష్ఠంగా ఒక గ్రామ పంచాయతీలో ఏమేం పనులు జరిగాయో తదుపరి సభలో నివేదిక అందించాలి.

Next Story

Most Viewed