ఉపముఖ్యమంత్రిగా ధర్మాన తొలి సంతకం దీనిపైనే..!

by  |
ఉపముఖ్యమంత్రిగా ధర్మాన తొలి సంతకం దీనిపైనే..!
X

దిశ, ఏపీ బ్యూరో: సచివాలయంలోని 5వ బ్లాకులోని తన ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన కృష్ణదాస్ తొలిసంతకం.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవిధంగా తయారు చేసిన ఫైల్‌పై పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్‌ నమ్మకం నిలబెడతానని చెప్పారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. 30 లక్షల మంది పేదలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన ప్రకటించారు.

రెవెన్యూ శాఖలో భూ సమస్యలు, తగాదాల సత్వర పరిష్కారానికి ఫ్రెండ్లీ రెవెన్యూ విధానానికి శ్రీకారం చుడతామని ఆయన చెప్పారు. రెవెన్యూ శాఖలో అవినీతికి తావు లేని విధంగా పారదర్శకంగా పనులు జరిగేలా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. తనకు కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం ఉత్తరాంధ్ర బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే చేసి, రికార్డులు నవీకరించనున్నామని, గ్రామ, వార్డు సచివాలయం ద్వారా అందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.

Next Story