తొలిరోజే నిరాశ పరిచిన ‘ధరణి’

by  |
తొలిరోజే నిరాశ పరిచిన ‘ధరణి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ తొలిరోజే ఇబ్బందులకు గురి చేసింది. స్మార్ట్ ఫోన్లో తమ ఆస్తులను వీక్షించుకోవచ్చునని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే పోర్టల్ ఓపెన్ కాలేదు. బాగా సతాయించిందని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా పోర్టల్ లో గురువారం సాయంత్రం వరకూ కనిపించిన వ్యవసాయం, వ్యవసాయేతర పోర్టళ్లల్లో ఒకటి కనిపించలేదు. కేవలం వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన ఆప్షన్ మాత్రమే కనిపించింది.

పైగా, ఏదైనా ఓపెన్ చేసి చూద్దామనుకున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మళ్లీ హోం పేజీకే వస్తుంది. ఐతే సభలోనూ సాంకేతిక సమస్యలుంటాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. లక్షలాది మంది వీక్షించడటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ముందుగానే ప్రకటించారు. ఐతే తొలిరోజే ధరణి స్లోగా రావడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. తమ ఆస్తులు ఉన్నాయో లేవో చూసుకోవాలన్న ఆతృత అందరిలోనూ కనిపించింది.

కొందరేమో ఇప్పటికే పాసు పుస్తకం, పహాణీ, 1 బి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఆప్షన్ విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారంతా అదే పనిగా ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. బ్రాండ్ విడ్త్ పెంచకపోవడం వల్లే ఓపెన్ కావడం లేదా.. మరేదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అన్న కోణంలో చర్చ సాగింది. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ వంటి వెబ్‌సైట్లకు ప్రతిరోజూ లక్షల్లో వ్యూస్ ఉంటాయి. వాటి మాదిరిగా సాంకేతిక దన్ను ధరణి పోర్టల్‌కు సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story