‘ధరణి’లో నో స్పీడ్

by  |
‘ధరణి’లో నో స్పీడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు రోజుల్లో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం కానుంది. రెవెన్యూ సిబ్బంది, అధికారులకు మంగళవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. సర్వర్ స్పీడ్ పెంచకుండా ఎన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం ఉండదని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్ స్పీడ్ కు అనుగుణంగా సర్వర్ స్పీడ్ కూడా ఉండాలంటున్నారు. ఇప్పటికే రాత్రీపగలు శిక్షణ పొందారు. టెక్నికల్ సపోర్టు లేకుండా ప్రాక్టీకల్స్ చేశారు. స్టేట్ లెవెల్ ఆఫీసర్ నుంచి డీఈఓల వరకు ఇబ్బంది పడ్డారు. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ చేయడానికి వృత్తిపరమైన నిపుణుల భాగస్వామ్యం అవసరం. తహశీల్దార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను నివారించాలని కోరుతున్నారు. పుండు ఒక దగ్గరుంటే మందు మరో చోట పెట్టొద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వీటి సంగతేమిటో

పార్టు బి కింద నమోదు చేసిన, వివాదాస్పద భూములపై ఓ క్లారిటీ రాలేదు. ఆర్ఎస్ఆర్లో తేడాలు కలిగిన సర్వే నంబర్లపైనా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ‘ధరణి’ని పబ్లిక్ డొమెయిన్ లో పెట్టడం మూలాన సమస్యలు ఎదురవుతాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ బాగుంది. స్టాంపు డ్యూటీ చెల్లింపులు, వివ రాల నమోదు చేయడం వంటి అంశాలను స్వయంగా రైతులు, కొనుగోలుదార్లు పూర్తి చేయలేరన్న అభిప్రాయం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయంలో వారికి ఎవరు సాంకేతిక సహకారాన్ని అందించాలన్న అంశంపైనా సందేహాలు ఉన్నాయి.

అందుబాటులోకి ‘ధరణి’

ఇప్పటికైతే ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. https://dharani.telangana.gov.in/homePage?lang=en ఈ లింకుతో ఓపెన్ అవుతుంది. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర అంశాలతో రెండు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో వెబ్ సైట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని భూముల వివరాలను నమోదు చేశారు. క్యాప్చా నమోదు చేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. దాంతో వివరాలు కనిపించడం లేదు. పీఓబీ జాబితాలను కూడా నమోదు చేశారు. హోం, స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్, ల్యాండ్ డిటెయిల్స్ సెర్చ్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఎన్క్ంబరెన్స్ డిటెయిల్స్, మార్కెట్ వ్యాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ స్టాంపు డ్యూటీ వంటి అంశాలు దర్శనమిస్తున్నాయి. నాన్ అగ్రికల్చరల్ పోర్టల్ లోనూ ప్రాపర్టీల వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఎన్కంబరెన్స్ వివరాలు, ఎస్ఆర్ఓ వివరాలు వంటివి ఉన్నాయి. పబ్లిక్ డొమెయిన్ లో ఎప్పుడు పెడతారో అంతుచిక్కడం లేదు. వ్యవసాయం, వ్యవసాయేతర సంబంధ అన్ని వివరాలను సామాన్యులు చూసుకునేదెప్పుడో తెలియడం లేదు. ధరణి వెబ్ సైట్ ప్రారంభోత్సవం నాటి నుంచి ఎవరైనా ఆస్తుల వివరాలను చూసుకునే వీలు కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా ఆస్తుల వివరాలను చూసుకునే వీలు ‘ధరణి’ ద్వారా సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఆస్తుల వివరాలకు ప్రైవసీ లేకుండా పోతుందన్న ఆవేదన కూడా ఉంది.

Next Story

Most Viewed