పేచీలు తెచ్చి పెట్టిన ధరణి పోర్టల్

by  |
పేచీలు తెచ్చి పెట్టిన ధరణి పోర్టల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విప్లవాత్మక మార్పులు తెస్తుందనుకున్న ‘ధరణి’పోర్టల్ వేలాది మంది రైతుల జీవితాలకు ‘ఆటో లాక్’వేసేసింది. తరతరాలుగా వచ్చిన భూములపై హక్కులను ప్రశ్నార్ధకం చేసింది. పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి. భూములనూ వారే దున్నుకుంటున్నారు. తాతముత్తాతల కాలం నుంచి వారే హక్కుదారులు. కొత్తగా వచ్చిన ధరణి మాత్రం అవి వారి భూములు కావంటోంది. అట్లెట్లా అని అడిగితే సమాధానమిచ్చే నాథుడు లేడు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదు. కనీసం కోర్టుకు వెళ్లాలన్నా ఏ అంశాన్ని ఆధారంగా తీసుకోవాలొ అంతు చిక్కడం లేదు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడుతామని, వాటిని ఆటోలాక్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వెంటవెంటనే జీఓలు విడుదల చేశారు.

వీటన్నింటినీ ‘ధరణి’పోర్టల్ లో ఆటో లాక్ చేశారు. క్రయ విక్రయాలను నిషేదించారు. భవన నిర్మాణాలకు అనుమతులను నిలిపివేశారు. నిజమైన హక్కుదారులను కూడా అందులో చేర్చడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ అధికారి వారీ గోడును వినిపించుకోవడం లేదు. ఏ కార్యాలయం నుంచీ వారికి భరోసా లభించడం లేదు. అభివృద్ధి పనులకు సేకరించిన భూములపైనా వివాదాలున్నాయి. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు నేటికీ పట్టాదారుల పేరిటే ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాలలో ఒకరి నుంచి ఎకరం సేకరిస్తే వారి సర్వే నంబరులోని పూర్తి భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రభుత్వానికీ నష్టం కలిగించారు. వేలాది మంది హక్కులనూ కాలరాశారు. అవసరాలకు భూములను అమ్ముకోవాలనుకుంటే ధరణి అడ్డొస్తోంది. సమస్యలను పరిష్కరిస్తారేమోననే ఆశతో తహసీల్దార్ కార్యాలయాల ముందు పడిగాపులు పడుతున్నారు.

తీసుకున్నది కొంత

ఆర్అండ్ బీ రహదారుల కోసం సేకరించిన భూములలోనూ రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. మూడేండ్ల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడెం, బట్లపల్లి, వట్టిపల్లి, రాజాపేటతండ గ్రామాలకు చెందిన రైతుల నుంచి కొంత భూమిని సేకరించి ఆర్అండ్ బీ రహదారి వేశారు. అవార్డు పాస్ చేశారు. తీసుకున్న భూమి కొంతే అయినా, ఆ సర్వే నంబర్లన్నీ తమవేనంటూ ప్రభుత్వం వాటిని నిషేదిత భూముల జాబితాలో చేర్చింది. మర్రిగూడ సర్వే నం.305లో 23 గుంటలు, 306లో 1.05 ఎకరాలు, 309లో 25 గుంటలు మాత్రమే రోడ్డుకు తీసుకున్నారు. ఆ మూడు సర్వే నంబర్లను పూర్తిగా పీఓబీ జాబితాలో చేర్చారు. దీన్ని మార్చాలంటూ వారు మూడేండ్లపాటు కలెక్టరేట్​ చుటూ తిరిగారు. తప్పును గుర్తించిన కలెక్టర్ సవరించాలంటూ స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. వారు సవరించామని రైతులకు చెప్పారు. ధరణిలో అలాంటి సర్వే నంబర్లను ఎత్తేశారు. ఇప్పుడు వందలాది మంది రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సర్వే నంబర్లను ధరణిలో కనిపించకుండా చేసినట్లు తెలిసింది.

పరిహారం చెల్లించి కూడా

సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాలు సేకరించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించారు. దశాబ్దాలు గడిచాయి. ఏయే భూములు ప్రభుత్వ ఖాతాలలో చేరాయంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. ఇప్పటికీ చాలా భూములు రైతుల పేరిటే ఉన్నట్లు సమాచారం. ఎస్సారెస్పీ, కేంద్ర సురక్షిత తాగునీటి పథకం కింద సేకరించిన భూములకు కూడా పట్టాదారు పుస్తకాలు ఇచ్చేశారు. ఇంకా అనేక ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల రికార్డులను పరిశీలిస్తే ఎంత మేరకు అవార్డు పాస్ చేసినవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారో తెలుస్తుంది. అన్నీ సక్రమంగా ఉన్న రైతులకేమో పాస్ పుస్తకం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. వ్యవసాయం చేయడం లేదు. లక్షల ఎకరాలు నాన్ అగ్రికల్చరల్ గా మారింది. ఇక్కడ డిజిటల్ సంతకం ఉండి పట్టాదారు పుస్తకాలు జారీ చేయడంతో నేటికీ ఎకరానికి రూ. ఐదు వేలు వంతున ఏడాదికి రూ.పది వేలు రైతుబంధు పొందుతూనే ఉన్నారు.

విలువల నిర్ధారణలోనూ

రిజిస్ట్రేషన్ విలువలను నిర్ధారించడంలోనూ రెవెన్యూ యంత్రాంగం కొన్ని పొరపాట్లు చేసింది. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలో చాలా ఏండ్ల​ క్రితం పలు వెంచర్లు వెలిశాయి. వాటిలో చాలా వరకు నాలా కన్వర్షన్ చేశారు. ఒకే గ్రామంలో 1000 ఎకరాలకు పైగా నాలా కన్వర్షన్ అయ్యింది. ఒక సర్వే నంబరులో 50 ఎకరాలు ఉండగా రియల్​ ఎస్టేట్​ సంస్థ ఐదెకరాలు కొనుగోలు చేసింది. అధికారులు మాత్రం ఆ సర్వే నంబరు మొత్తాన్ని వ్యవసాయేతర భూములుగా రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో ఎకరా భూమి రిజిస్ట్రేషన్ విలువ రూ. రెండు లక్షలకు బదులుగా ఏకంగా రూ.15 లక్షలకే చేరింది. దాంతో భూములను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తహశీల్దార్ పొరపాటును గుర్తించి ఓ లేఖ రాసిచ్చారు. కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగులో పెట్టారు. వారందరికీ అవి వ్యవసాయ భూములంటూ ఇచ్చిన పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికీ సాగు చేస్తునే ఉండడం గమనార్హం. విజయవాడ హైవే పక్కన 22 ఏండ్ల క్రితం కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు 1,080 ఎకరాల వరకు సాగు భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చారు. ఆ భూమిలో ఏదేని ఒక సర్వే నంబరులోని కొంత నాలా కన్వర్షన్ చేస్తే.. ఆ సర్వే నంబరు మొత్తాన్ని వ్యవసాయేతర భూములుగా మార్చి జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించారు. సర్వే నం.43లో 150 ఎకరాలు ఉంటుంది. అందులో సీలింగ్ భూమి 37 ఎకరాలు. మిగదంతా పట్టాభూమి. అందులో కొంత నాలా కన్వర్షన్ చేశారు. రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబరు మొత్తాన్ని వ్యవసాయేతరంగా నమోదు చేశారు. రైతులకు పట్టాదారు పుస్తకాలు కూడా జారీ చేశారు. ఎకరా ధర రూ.14.52 లక్షలుగా వేశారు. దాంతో కొనుగోలు చేసేవారికి పెను భారంగా మారింది. దీన్ని మార్చాలని ఏండ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పు వారిది అయినా

భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు చేసిన పొరపాట్ల కారణంగా ఆర్ఎస్​ఆర్ విస్తీర్ణం పరంగా తప్పులు చోటు చేసుకున్నాయి. సమస్య పరిష్కారమైతేగానీ పాస్ పుస్తకాలు ఇవ్వబోమని చెప్పడంతో నిజాయితీగా హక్కులు కలిగిన రైతాంగం తీవ్ర నిరాశలో ఉన్నారు. ధరణి పోర్టల్​ ప్రారంభమైన తర్వాత అధికారులు చేసిన తప్పులకు హక్కులు కోల్పోయామని బాధ పడుతున్నారు. నిషేదిత జాబితా విషయంలో మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త జాబితాను రూపొందించాలి. గతంలో ఉన్నదే యథాతథంగా క్రోఢీకరించడం వల్ల వేలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిషేదిత భూముల జాబితాను తయారు చేసేటప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఎల్ఆర్ యూపీ కింద అనేక తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దడానికి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల లాగిన్ లోకి పంపారు. వాటి సంగతి కూడా తేల్చలేదు. పీఓబీ జాబితా రూపకల్పనకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. ఆ ప్రక్రియ పూర్తి చేయకుండానే సీఎం ఆదేశాల మేరకు పక్కా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్యాయం చేశారు: –బట్టు వెంకన్న, రైతు, మర్రిగూడ, నల్లగొండ జిల్లా

గతంలో మా భూమి గుండా రోడ్డు వేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మొత్తం సర్వే నెంబరు ప్రభుత్వ భూమిగా నమోదు అయ్యింది. కలెక్టర్ దీనిమీద సర్వే నెంబర్లవారీగా రోడ్డు విస్తీర్ణం, పట్టా భూమి ఎంత అనే వివరణతో సీసీఎల్​ఏ కు లేఖ పంపారు. అప్పటి నుంచి రోడ్డు విస్తరణ, పట్టా వివరాలు విడివిడిగా నమోదు చేసి తిరిగి జిల్లా రిజిస్ట్రార్ కు, కలెక్టర్ కు పంపారు. ఇప్పుడు మేం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్తే మునుపు మా సర్వే లో రోడ్డు పోయిన కారణంగా, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుత లేదు. మాదే కాదు మర్రిగూడ మండలంలో రోడ్డు పోయిన భూములు అన్ని ధరణి లో రిజిస్ట్రేషన్ కావటం లేదు. మా సమస్యను పరిష్కరించండని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.

Next Story