- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కలకత్తా కాళీ.. శక్తిపటాలతో మచిలీపట్నంలో ఎలా వెలసింది..? అబ్బురపరుస్తున్న ఆలయ ప్రత్యేకతలు!
దిశ, వెబ్ డెస్క్: దసరా నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం. కానీ.. విజయవాడ కంటే దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. మరెక్కడో కాదు. మన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో. కలకత్తా కాళీమాత ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. కాదు కాదు.. అంతకంటే ఘనంగా ఇక్కడ శక్తిపటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనివెనుక వంద సంవత్సరాలకు పైగా చరిత్రే ఉంది. మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు జరిగినట్లుగా.. తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతంలో జరగవంటే అతిశయోక్తి కాదు. మచిలీపట్నం ఈడేపల్లిలో ఉన్న ఆలయంలో ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా పూజలందుకుంటోన్న కాళీమాత చరిత్ర ఏంటి ? ఇక్కడ శక్తిపటాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
మూడు తరాలుగా పూజలు..
మచిలీపట్నానికి చెందిన కాళీరంగా స్వామి వారు బ్రిటీష్ కాలంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆయన అమ్మవారి ఉపాసకులుగా చెబుతారు. కలకత్తాలో ఉన్న కాళీమాత ఆలయానికి వెళ్లి దర్శించుకుని ఇంటికి చేరుకోగా.. ఆ రాత్రికి ఆయన కలలోకి అమ్మవారు వచ్చి.. "నేను నీ వెంట వచ్చాను. ఇక్కడ నాకు గుడి కట్టి పూజలు చేయండి. కలకత్తాలో దసరా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా చేయండి." అని ఆజ్ఞాపించిందట. వెంటనే ఆయన.. ఈడేపల్లి సెంటర్ లో ఎనిమిది దిక్కులు కలిసే కూడలిలో ఆలయన నిర్మాణానికి సంకల్పించారు. అష్టలక్ష్ములు కలిసిన ఆది పరాశక్తిగా అమ్మవారు కొలువుదీరారు. దాదాపు 160 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు నిర్విరామంగా పూజలందుకుంటున్నారు. వేద పండితునికి తప్ప.. మామూలు వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని తాకరు. కాళీరంగా స్వామి తర్వాత.. దుర్గా సింగ్.. ఆయన తర్వాత హరీష్ సింగ్.. ఇలా మూడు తరాలుగా అమ్మవారికి ఆ కుటుంబం దసరా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది.
శక్తి పటాలు ఎందుకు ?
శక్తి పటాలు.. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రభలు. ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని కదిలించలేరు కాబట్టి.. అమ్మవారి రూపాన్ని ప్రభపై చిత్రిస్తారు. అది అమ్మవారి ఉగ్రరూపం. ఆవిడ ఆగ్రహాన్ని ఆపడం ఒక్క హనుమంతుల వారికే సాధ్యం కాబట్టి.. ప్రభకు వెనుక వైపు ఆంజనేయస్వామి చిత్రాన్ని గీస్తారు. దసరాకు నెలరోజుల ముందు నుంచే ఈ ఘట్టం మొదలవుతుంది. వెదురు కర్రలతో ప్రభను తయారు చేసి.. దానిపై మందమైన పేపర్ ను అతికిస్తారు. దానిపై అమ్మవారి, ఆంజనేయస్వామి చిత్రాలను గీస్తారు. నరకాసుర వధ చేసిన సమయంలో అమ్మవారు ఎలా ఉంటుందో.. ఇక్కడ శక్తిపటంపై ఉండే అమ్మవారి రూపం అలాగే గీస్తారు.
తొలినాళ్లలో ఈడేపల్లి శక్తిగుడి ప్రభ ఒక్కటే ఉండేది. కాలక్రమేణా ఇప్పుడు మచిలీపట్నంలో ఒక్కో ఆలయానికి ఒక్కో శక్తిపటం ఉంది.
అమావాస్య రోజున కాపాలిక పూజలు..
దసరా ఉత్సవాల్లో ఇంటింటికీ వెళ్లే అమ్మవారిని.. బాధ్రపద అమావాస్య రోజు అర్థరాత్రి సమయంలో ఆలయం నుంచి బయటికి తీసుకువస్తారు. దానిని ఒక వ్యక్తికి కట్టి.. ఆలయ పూజారితో కలిసి హిందీ స్మశాన వాటికకు తీసుకుని వెళ్తారు. అక్కడ పూజారి కాపాలిక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆనకట్ట కట్టి అమ్మవారిని ఆహ్వానిస్తారు. అనంతరం పురవీధుల్లో ఊరేగిస్తూ.. ఆలయానికి తీసుకువెళ్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న సంప్రదాయం. దీనికి స్థానికులు కంటిలో చుక్కగా నామకరణం చేశారు.
పసుపు మొక్కులు.. ఉపవాసం తప్పనిసరి
పాడ్యమి నుంచి విజయదశమి వరకూ మేళ తాళాతలతో, మంగళ వాయిద్యాలతో శక్తిపటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. ముందుగా పటం కట్టుకున్న వ్యక్తి ఇంటికి వెళ్తారు. అనంతరం ఆ వీధిలో ప్రతి ఇంటికి అమ్మవారిని తీసుకెళ్తారు. శక్తిపటం కట్టుకున్న వ్యక్తి కాళ్లను పసుపు నీటితో కడిగి, కొబ్బరికాయ సమర్పించి, హారతినిస్తారు. ఉద్యోగం వస్తే, పిల్లలు పుడితే, పెళ్లి జరిగితే..ఇలా ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. తీరిన వారు.. శక్తిపటాన్ని కట్టుకుని మొక్కు తీర్చుకుంటారు. ఇందుకు అబ్బాయిలు మాత్రమే అర్హులు.
శక్తిపటాన్ని కట్టుకునే వ్యక్తి.. ఆ రోజు ఉదయం పాలు తాగడం మినహా ఏమీ తినకూడదు. ఉపవాసం కచ్చితంగా ఉండాల్సిందే. నల్లచీర, కాళ్లకు గజ్జెలు కడతారు. శక్తిపటాన్ని నడుముకు బిగించాక.. ముఖానికి కాళీమాత రూపాన్ని తలపించేలా ఉండే కలహారాన్ని కడతారు. చేతిలో ఒక కత్తిని పెడతారు. అంతా పూర్తయ్యాక ఆ వ్యక్తిని అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు. అందుకే శక్తి పటాన్ని కట్టుకున్న వ్యక్తిని అమ్మవారిగా భావిస్తారు ఇక్కడి ప్రజలు.
ఇక.. అమ్మవారికి కొందరు పసుపు మొక్కులు మొక్కుతారు. తమ కోరికలు తీరితే పసుపు ఆడిస్తామని మొక్కుకుంటారు. ఈ మొక్కులను ఈ నవరాత్రుల్లో మాత్రమే తీరుస్తారు. ఎవరైతే పసుపు మొక్కులు తీర్చాలో వారి ఇంటి వద్దకు శక్తిపటాన్ని తీసుకెళ్తారు. డప్పులు మోగిస్తూ ఉండగానే.. కేజీల కొద్దీ పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున ఇవి ఎక్కువగా జరుగుతాయి.
ఆఖరి రోజు చాలా స్పెషల్
9 రోజులు జరిగే శక్తిపటాల ఉత్సవాలు ఒక ఎత్తయితే.. విజయదశమి రోజున జరిగే సంబురాలు మరో ఎత్తు. ఆ రోజు ఉదయం మొదలు.. మర్నాడు ఉదయం వరకూ శక్తి పటాలు పురవీధుల్లో తిరుగుతూనే ఉంటాయి. విజయదశమి రోజున రాత్రి ప్రతి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పట్టణానికి నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్ కు అన్ని ఆలయాల శక్తిపటాలు చేరుకుంటాయి. అక్కడ పెద్ద పూజారి జమ్మిచెట్టు ఆకులతో ప్రత్యేక పూజలు చేసి, అందరికీ ఆ ఆకులను పంచిపెడుతారు. అమ్మవారితో పాటు శమీచెట్టు కొమ్మలను తీసుకువచ్చి ఆలయంలో ఉంచడంతో.. ఇక్కడ దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాన్ని కన్నులారా చూసేందుకు ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతూరికి చేరుకుంటారు. కుల, మత బేధాలు లేకుండా మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు.