బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడుందో తెలుసా.. అక్కడ ఇదే స్పెషల్!

by Disha Web Desk |
బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడుందో తెలుసా.. అక్కడ ఇదే స్పెషల్!
X

దిశ, వెబ్‌డెస్క్: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత దేశం. భారతీయులకు భక్తిభావం ఎక్కువే. రాజుల కాలం నేటి వరకు దేవదేవుళ్లకు ఆలయాలు నిర్మిస్తూ.. పూజిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మన దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో కొన్ని స్వయంభూ వెలసిన దేవుళ్లు ఉంటే, మరికొన్ని పూర్వం రాజులు ప్రతిష్టించినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలోని దైవం మాత్రం కాస్త ప్రత్యేకం. ఈ ఆలయంలోని దైవం స్వయంభూ వెలసినది కాదు, అలాగని రాజులు, భక్తులు ప్రతిష్టించింది కూడా కాదు. మరి ఆ ఆలయంలో దైవం ఎలా వెలసింది అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి...!

పూర్వం 16వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ బ్రహ్మలింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బలిఘట్టంలో ఉంది. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మించారు. రాతి స్తంభాలు, పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయం పూర్తి స్థాయిలో నిర్మించినట్లు పురావాస్తు శాఖ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఆలయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ గరళకంఠున్ని లింగరూపంలో ప్రతిష్టింపజేశాడట. అందుకే దీనిని బ్రహ్మలింగేశ్వర ఆలయంగా పిలుస్తారట. అంతేకాక ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఆది నుంచి ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది.

స్థల పురాణం ఏం చెబుతుందంటే..

బలిచక్రవర్తి లోక కళ్యాణార్ధం చేయదలచిన ఓ యజ్ఞానికి శివారాధన ఎంతో అవసరమని తెలుసుకుని ఆ బ్రహ్మ దేవున్ని ప్రార్ధించాడు. ఆయన ప్రార్థనకు మెచ్చిన బ్రహ్మదేవుడు లింగాన్ని భూ లోకంలో ప్రతిష్టించపచేశాడని చరిత్ర చెబుతుంది. అందుకే ఆ ప్రాంతాన్ని బలిఘట్టంగా పిలుస్తారు. బలిచక్రవర్తి తరువాత రాజు స్థానంలో వచ్చిన హిందూ మహారాజు శివునికి ప్రతి రోజు పూజలు చేసేవాడని చరిత్ర చెబుతుంది. నిత్య అభిషేక ప్రియుడైన శివునికి అభిషేకం చేయడానికి నీరు లేకపోవడంతో హిందూ రాజు విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. ఆయన తప్పస్సును మెచ్చిన విష్ణుమూర్తి వరాహావతారంలో దర్శనం ఇచ్చి రాజు ప్రార్థనను మన్నించి నీటిని ప్రసాదించాడు. వరాహా రూపంలో ఉన్న విష్ణు ఓ మార్గం గుండా నడవడంతో ఆ మార్గం నదిగా ఏర్పడి ప్రవహించడంతో వరహానదిగా పేరుగాంచినట్లు చెబుతున్నారు. ఈ నది అన్ని నదుల్లా కాకుండా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. అందుకే దాన్ని ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మచేత ప్రతిష్టింపబడిన ఈ శివలింగానికి పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

ఇక్కడ స్పెషల్.. విభూతి గనులు

విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బలిఘట్టంలో త్రిశూల పర్వతంపై ఈ ఆలయం ఉంది. అంతే కాదు ఈ ఆలయానికి సమీపంలో శివునికి ఎంతో ఇష్టమైన విభూతి గనులు కూడా ఉన్నాయి. ప్రతి సోమవారం ఆ లింగరూపుడికి భక్తులు అభిశేకాలు చేస్తుంటారు. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు.


Next Story

Most Viewed