ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు.. కాలసర్ప దోషం తొలగిపోయినట్టే..

by Sumithra |
ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు.. కాలసర్ప దోషం తొలగిపోయినట్టే..
X

దిశ, ఫీచర్స్ : చాలా మందికి వారి జాతక చక్రంలో కాల సర్ప దోషం యోగం ఉంటుంది. ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు జ్యోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పరిహారాలు లేకుండా కూడా కాల సర్పదోషాన్ని తొలగించవచ్చని చాలా మందికి తెలిసి ఉండదు. ఏంటి ఇది నిజమా అనుకుంటున్నారు కదా, ముమ్మాటికి ఇది నిజం అంటున్నారు పండితులు. కాలసర్ప యోగం ఉన్నవారు ఈ ఆలయానికి వెళితే చాలు దోషాలన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. మరి ఆ క్షేత్రం ఎక్కడ ఉంది. ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నిత్యం ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా నాగపంచమి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు లేకుండా ఈ ఆలయంలో కాలసర్ప దోషం తొలగిపోతుంది.

ఆలయ విశేషాలు..

కాలసర్ప దోషాన్ని తొలగించే ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో వెలసింది. ఈ ఆలయం దర్యాగంజ్ ప్రాంతానికి ఉత్తరం వైపున ఉంది. ఈ ఆలయంలో నాగరాజు, వాసుకి దేవతలుగా కొలువై ఉన్నారు. ఆ దేవాలయం పేరు కూడా నాగరాజు వాసుకి దేవాలయం. ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకే నాగరాజు దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ ఆలయానికి వస్తుంటారు.

ఆలయంలో కాలసర్ప దోషాన్ని ఇలా తొలగిస్తారు..

పూజా సామాగ్రిని నాగరాజు వాసుకి ఆలయానికి తీసుకెళ్లినంతనే కాలసర్ప దోషం నుండి విముక్తి పొందవచ్చని ఆలయ పూజారులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ పూజ చేసే విధానాన్ని కూడా వివరించారు. ముందుగా ప్రయాగ సంగమంలో స్నానం చేయాలట. తర్వాత శనగలు, పువ్వుల దండ, పాలతో వాసుకి నాగ ఆలయానికి వెళ్లాలి. దీని తరువాత, వాసుకి నాగని సందర్శించి పూజా సామాగ్రిని నాగదేవునికి సమర్పించి కాలసర్ప దోషాన్ని తొలగించమని ప్రార్థిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.

పురాణాలలో నాగ వాసుకి దేవాలయం ప్రస్తావన..

గంగాదేవి స్వర్గం నుండి పాతాళానికి వెళ్లిందని పురాణాలలో వర్ణించారు. పాతాళంలో ప్రవహిస్తూ నాగరాజు వాసుకి గుమ్మాన్ని తాకిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో భోగవతి తీర్థం ఏర్పడిందని చెబుతున్నారు. దీని తరువాత నాగరాజు వాసుకి, మిగిలిన దేవతలు పాతాళాన్ని వదిలి వేణుమాధవుని దర్శనం చేసుకోవడానికి ప్రయాగకు వెళ్లారట.

భూలోకానికి భోగవతి తీర్థం..

నాగరాజు వాసుకి ప్రయాగకు వెళ్లినప్పుడు భోగవతి తీర్థం కూడా ప్రయాగకు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రదేశం నాగరాజు వాసుకి సమేతంగా భోగవతి తీర్థానికి కూడా నిలయంగా మారిందట. ఇక్కడ ఆలయానికి తూర్పున, గంగానదికి పశ్చిమాన భోగవతి తీర్థం ఉంది. వర్షాకాలంలో గంగ ప్రవహించినప్పుడు దాని నీరు ఆలయ మెట్లపైకి చేరుతుంది. ఆ సమయంలో అక్కడ స్నానమాచరించిన భక్తులందరికీ భోగవతీ తీర్థ పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.

దోషాలు మాత్రమే కాదు వ్యాధుల కూడా తగ్గుతాయి..

పూర్వం కుష్టు వ్యాధితో బాధపడుతూ ఓ మరాఠా రాజు ఉండేవాడట. తన కుష్టు వ్యాధి నయమైతే ఆలయాన్ని పునరుద్ధరిస్తానని నాగవాసుకి ఆలయంలో ప్రతిజ్ఞ చేశాడట. దీని తర్వాత, కొంత కాలానికి రాజు కుష్టు వ్యాధి నుండి విముక్తి పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నాగ వాసుకి ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. అంతే కాదు అతను ఆలయంతో పాటు శాశ్వత ఘాట్ కూడా నిర్మించాడట.

Next Story