ఈ ఆలయానికి పురుషులు రావాలంటే.. చీర కట్టుకోవాల్సిందే..

by Sumithra |
ఈ ఆలయానికి పురుషులు రావాలంటే.. చీర కట్టుకోవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్లాలంటే స్త్రీలు కానీ పురుషులు కానీ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఇలాంటి నియమాలు దాదాపుగా అన్ని ఆలయాల్లోనూ ఉన్నాయి. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం కొన్ని విచిత్రమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఆలయంలో ప్రవేశించినప్పుడు నాలుకకి శూలం గుచ్చుకోవడం, జుట్టు ముడి వేసుకోవడం ఇలాంటివి. అయితే కేరళలోని ఒక ఆలయంలో కూడా ఇలాంటి ఒక భిన్నమైన ఆచారం ఉంది. ఇంతకీ ఆ ఆచారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా. మరెందుకు ఆలస్యం ఇప్పుడే తెలుసుకుందాం.

కేరళలోని కొల్లం జిల్లా కోల్లారా అనే గ్రామంలో 'కొట్టంకులంగర దేవి' ఆలయం ఉంది. ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు మహిమాన్వితమైనదిగా చెబుతారు. అయితే ఇక్కడి ఆలయంలో చిత్రవిచిత్రమైన ఓ ఆచారం అనాదిగా వస్తుంది. శబరిమల ఆలయంలో మహిళలకు ఎలా ప్రవేశం లేదో, ఈ కొట్టంకులంగర ఆలయంలో పురుషులకు ప్రవేశం లేదు. ఒక వేళ ఖచ్చితంగా పురుషులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే పూర్తిగా మహిళలు అలంకరించుకున్నట్టు అలంకరించుకోవాలట. అచ్చం ఆడవారిలా చీరను కట్టుకుని, బొట్టు, పూలు, గాజులు, కాటుక, పట్టీలు ఇలా 16 అలంకారాలు చేసుకోవాలట. అప్పుడే ఆలయంలోకి అనుమతిస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు.

ఆలయంలోనే మేకప్ ఏర్పాట్లు..

వాస్తవానికి, పురుషులు 16 అలంకారాలు ధరించి బయటి నుంచి వస్తారు. కానీ ఎవరైనా వేరే నగరం నుండి వచ్చినట్లయితే. లేదంటే బయటి నుంచి మేకప్ వేసుకుని రాకపోతే గుడిలోనే అందుకు ఏర్పాట్లు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకప్ గది ఉంటుంది. అబ్బాయి తల్లి, భార్య, సోదరి అలంకారంలో సహాయం చేయొచ్చంట.

ఆలయంలో అమ్మవారిని పురుషులు పూజించే ఈ విశిష్ట ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆలయంలో 'చమయవిళక్కు' ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున, వేలాది మంది పురుషులు మేకప్ వేసుకుని ఇక్కడికి వస్తారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం లాంటి ఎలాంటి కోరికలైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

ఎక్కువగా మంచి ఉద్యోగం, మంచి భార్య కావాలనే కోరికతో పురుషులు ఇక్కడికి వస్తుంటారని పండితులు చెబుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం పూజలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో పురుషులు స్త్రీల వేషంలో ఇక్కడికి చేరుకుంటారు. కోరికలు నెరవేరగానే వచ్చి మొక్కులు చెల్లించుకొంటారు.

ఆలయ చరిత్ర

పురాణాల ప్రకారం పూర్వం కొంతమంది గొర్రెల కాపరులు, స్త్రీల వలె దుస్తులు ధరించి ఆలయం వెలసిన స్థలంలోనే రాయి పై పూలు వేసి పూజలు చేశారట. ఆ తర్వాత రాయి నుండి శక్తి ఉద్భవించి కాలక్రమేణా భక్తులకు విశ్వాసం పెరిగిందట. ఆ తరువాత ఆ ప్రదేశాలన్ని కొట్టన్‌గా పిలిచి ఆలయం కట్టారట. అప్పటి నుంచి ఆలయానికి పురుషులు స్త్రీ వేషధారణలో ఇక్కడికి వచ్చి పూజలు చేయడం సాంప్రదాయంగా మారింది. ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ఏమిటంటే ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహం కొన్ని అంగుళాలు పెరుగుతూ ఉంటుంది. ఓసారి ఆలయంలో వెలసిన రాయికి కొబ్బరికాయను కొడితే రక్తం వచ్చినట్టు అక్కడి భక్తులు చెబుతున్నారు.

Next Story

Most Viewed