వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..!

by Dishanational4 |
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితికి వక్రతుండున్ని మండపానికి తీసుకువచ్చింది మొదలు నవరాత్రులు ముగిసేంత వరకు భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. నిత్యాన్నదాన, నిత్య పూజలు, భజనలు జరిపిస్తుంటాం. అంత భక్తి శ్రద్దలతో పూజించిన ఏకదంతుని నవరాత్రులు ముగిసాక నదుల్లో, వాగుల్లో, సముద్రంలో నిమజ్జనం చేస్తారు.

అసలు అన్ని రోజులు పూజించి గణపతిని ఎందుకు నీటిలో నిమజ్జనం చేయాలి. అందుకు గల కారణాలు ఏంటి. ఎప్పుడైనా ఆలోచించారా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం వినాయక చవితి వచ్చిందంటే చాలు నదులలోను, వాగులలోను దొరికే ఒండ్రుమట్టిని తీసుకువచ్చి గణపయ్య ప్రతిమను చేసి ప్రతిష్టించేవారు. నవరాత్రులు ముగిసేంత వరకు ఏకవింశతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకులతో భక్తి శ్రద్దలతో కొలిచేవారు. అలా పూజలో ఉపయోగించే ఒండ్రు మట్టిలో, పత్రాలలో ఔషధి గుణాలు ఉంటాయి. వర్షాకాలంలో నదుల్లో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూజ ముగిసిన తర్వాత విగ్రహాన్ని, పత్రిని నదిలో వదలడం వలన ఔషధ గుణాలు నీటిలో కలిసి నీరు స్వచ్ఛంగా, క్రిమిరహితంగా మారుతుందని పూర్వీకుల నమ్మకం.

అంతేకాదండోయ్ వినాయక చవితి నాటికి జోరు వర్షాలు కురవడంతో వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. వాటి ప్రవాహానికి నదులు, వాగులు తీరం కొట్టుకుపోతాయి. అలాంటి సమయంలో మట్టి విగ్రహాలను తీరం వెంబడి నిమజ్జనం చేయడంతో వరద పోటును కాస్తైనా తగ్గించే అవకాశం ఉంటుందని పెద్దల మాట. ఇది నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. కానీ, ప్రస్తుత కాలంలో వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయడం ద్వారా అవి నీటిలో కరగకుండా నీరు మరింత కలుషితం అవుతుంది. విగ్రహాలకు అద్దే రంగులు వల్ల నీటిలో ఉండే జీవులన్ని చనిపోతున్నాయి. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలనే నిలుపుదాం.



Next Story