ఓటు వేసిన వారికే ‘కాలువపై కల్వర్టు’.. ఖమ్మంలో టీఆర్ఎస్ వింత వాదన

by  |
ఓటు వేసిన వారికే ‘కాలువపై కల్వర్టు’.. ఖమ్మంలో టీఆర్ఎస్ వింత వాదన
X

దిశ ఖమ్మం టౌన్ : ఏళ్లు గడుస్తున్నా ఖమ్మం నగరంలోని 46వ డివిజన్‌లో అదే దుస్థితి. గోళ్లపాడు కాలువ అభివృద్ధి పనుల కోసం జిల్లా మంత్రి రూ.70కోట్లు ఖర్చు పెట్టినా ఆ నిధులు సరిపోలేదు. దీంతో మరో రూ.30 కోట్లు ఖర్చు చేసినా అక్కడ నివసిస్తున్న ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను స్థానిక ప్రజాప్రతినిధి గాలికి వదిలేశారు. గోళ్లపాడు ఛానల్‌లో భాగమైన కాలువను అభివృద్ధి చేసి స్థానిక ప్రజలను మురికి కూపం నుండి బయట పడేయాల్సి పోయి ఇతర పార్టీకి చెందిన వారు అంటూ డివిజన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం.

ఎంతమంది కమిషనర్లు మారినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. గోళ్లపాడు ఛానల్ కాలువ మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రచారాలకే పరిమితం చేశారు. ఇప్పటికీ కాలువలో కొంతభాగం మాత్రమే సైడ్ వాల్స్ కట్టి వదిలేశారు. దీంతో చిన్న పాటి వర్షాలకే కాలువలో మురుగు నీరు పేరుక పోయి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో రోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాలువ మరమ్మత్తులు పనులు ఇప్పటివరకు సగమే జరిగాయి. ఇప్పటికీ మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలంటే ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కాలువ పనులు పూర్తి అయిన చోట కాలువపై కల్వర్టుల నిర్మాణాలు కూడా సొంత పార్టీ వారికే చేపట్టడం శోచనీయం. ఇదేమిటి అని అడిగిన వారిని నీవు మాకు ఓటు వేయలేదని కల్వర్టు కట్టేది లేదని.. మరోవైపు దారి చూసుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం స్పందించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Next Story