తుగ్ల‌క్ నిర్ణయం.. రూ. 2 కోట్లు నాశ‌నం

by  |
telengana news
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో అభివృద్ధి ప‌నులు ట్రాక్ త‌ప్పుతున్నాయి. ముందు చూపులేని వైఖ‌రి, సాధ్యా సాధ్యాలు, ప్ర‌జా ఆద‌ర‌ణ‌లేని ప‌నుల‌కు అభివృద్ధి పేరిట‌ రూ.కోట్ల ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేస్తూ ప్ర‌భుత్వం అభాసుపాల‌వుతోంది. ఇందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా వ‌రంగ‌ల్ న‌గ‌ర రోడ్ల‌పై నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ హాస్యాస్ప‌దంగా మారుతోంది. ఒక‌రిద్ద‌రి ప్ర‌జాప్ర‌తినిధుల సొంత అభిరుచిని మొత్తం ప్ర‌జానీకం మీద రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం బెడిసికొట్టింది. సైక్లింగ్ ట్రాక్‌ల మ‌ధ్య‌లో ఇప్ప‌టికే బ్రేక్ పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేసి నిరూప‌యోగంగా మార్చిన గ్రేట‌ర్ అధికారులు.. ఇప్పుడు ట్రాక్‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టి అష్టావ‌క్ర‌గా సైక్లింగ్ ట్రాక్‌ను త‌యారు చేస్తుండ‌టంపై వ‌రంగ‌ల్ వాసులు మండిప‌డుతున్నారు.

పర్యావరణ అనుకూల రవాణాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం, సైక్లింగ్​ను న‌గ‌ర వాసుల‌ జీవనశైలిలో భాగం చేయ‌డం, పిల్లలకు సురక్షితమైన సైక్లింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి ఉన్న‌త ల‌క్ష్యాల‌తో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశామని అప్ప‌ట్లో అధికారులు చెప్పుకొచ్చారు. అయితే తాజా ప‌రిణామాలు మాత్రం వెక్కిరించేలా త‌యార‌వుతున్నాయి.

రూ. 2 కోట్లు నాశ‌నం..

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అప్ప‌టి పాల‌క వ‌ర్గం రూ.2కోట్ల స్మార్ట్‌సిటీ నిధుల‌తో కాజీపేట ఫాతిమా నుంచి ఫారెస్ట్ కార్యాల‌యం వ‌ర‌కు దాదాపు రెండున్న‌ర కిలోమీట‌ర్ల మేర వ‌రంగ‌ల్‌- హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం చేప‌ట్టింది. సైక్లింగ్ ట్రాక్ నిర్మాణంపై మొద‌ట్లోనే ఈ ప‌నులు అవ‌స‌రమా..? అన్న విమ‌ర్శ‌లు న‌గ‌ర‌వాసుల నుంచి వినిపించాయి. అయినా ముందు వెనుకా ఆలోచించ‌కుండా, సాధ్య అసాధ్యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఆఘ‌మేఘాల మీద నిర్మాణం పూర్తి చేసింది. సైక్లింగ్ ట్రాక్‌పై మంత్రి కేటీఆర్ సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించారు. గొప్ప సృజ‌నాత్మ‌క‌త డెవ‌ల‌ప్‌మెంట్ అన్న రీతిలో వ్యాఖ్య‌నిస్తూ పోస్టు పెట్ట‌డం విదిత‌మే. నిర్మాణం పూర్త‌యి దాదాపు ఆరు నెల‌లు కావొస్తున్నా సైక్లింగ్ ట్రాక్‌కు న‌గ‌ర వాసుల నుంచి క‌నీస ఆద‌ర‌ణ కూడా లేదు. వ్యాపార దుకాణాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా సైక్లింగ్ ట్రాక్ మ‌ధ్య‌లో బ్రేక్ పిల్ల‌ర్లను ఏర్పాటు చేసుకునే వీలు క‌ల్పించారు. దీంతో ట్రాక్‌లో సైక్లింగ్ చేయాల‌నుకున్న అతికొద్దిమంది యువ‌త‌కు కూడా నిరాశే ఎదుర‌వుతోంది.

మొక్క‌లు నాటుతుండడంతో అష్టావ‌క్ర‌గా ట్రాక్‌..

రూ. 2 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ట్రాక్ నిర్మాణం ఎందుకు ప‌నికి రాకుండాపోగా.. ఇప్పుడు ట్రాక్‌లో మొక్క‌లు నాటుతుండ‌టంతో అష్టావ‌క్ర‌గా త‌యార‌వుతోంది. ఫుట్‌పాత్‌ల ఆనుకుని నిర్మించిన సైక్లింగ్ ట్రాక్‌లో వైట్‌లైన్ బార్డ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ట్రాక్‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండానే బార్డ‌ర్ ఆవ‌ల మొక్క‌లు నాటుతున్నామ‌ని అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు. అయితే అస‌లే ఇరుకుగా మారిన ట్రాక్‌లో మొక్క‌లు నాట‌డం అవ‌స‌ర‌మా..? అంటూ వ‌రంగ‌ల్ వాసులు తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉండ‌గా దుకాణదారులు వినియోగ‌దారులు వ‌చ్చిపోయేందుకు వీలుగా ట్రాక్‌ను మ‌ల్చుకునే చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. నిర్మాణాలు జ‌రుగుతున్న చోట్ల ట్రాక్ మ‌ధ్య‌లోనే నిర్మాణ సామ‌గ్రి, ఇసుక‌ను డంప్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

telengana news

ఫుట్‌పాత్‌ల‌పై వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న కొంత‌మందికి ఇది అద‌న‌పు స్థ‌లంగా మారింది. కొన్నిచోట్ల మురికి కాల్వ‌ను త‌ల‌పిస్తోంది. మ‌రికొన్నిచోట్ల ట్రాక్ ఆన‌వాళ్లు క‌నిపించ‌కుండా వ‌ర‌ద నీటితో నిండిపోయింది. బుర‌ద‌తో వికృతంగా క‌నిపిస్తోంది. ఇలా స‌వాల‌క్ష లోపాల‌తో సైక్లింగ్ ట్రాక్ అనేక ప్ర‌శ్న‌ల‌ను గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల ముందు ద‌ర్శ‌నమిస్తోంది. మ‌రి ఈ ట్రాక్‌ను చ‌క్క‌దిద్దుతారా..? అలానే వ‌దిలేస్తారా..? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించ‌నుంది.

తుగ్ల‌క్ నిర్ణ‌యాల‌తో ప్రజాధ‌నం నాశ‌నం..

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రం అభివృద్ధి తుగ్ల‌క్ నిర్ణ‌యాల‌తో సాగుతోంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మొక్క‌ల పెంప‌కం అనేది మంచి నిర్ణ‌య‌మే. దాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. మొక్క‌ల పెంప‌కానికి ప‌ట్ట‌ణంలో అనేక స్థ‌లాలు ఖాళీగా ఉన్నాయి. అక్క‌డ నాటడం వ‌దిలేసి రోడ్ల‌ను నాశ‌నం చేస్తూ మొక్క‌లు నాట‌డం అంటే ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఆర్భాటాలు త‌ప్పా న‌గ‌రాభివృద్ధిపై ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేదు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. త‌ప్ప‌కుండా వీరికి బుద్ది చెబుతారు. నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, వ‌రంగ‌ల్ అర్భ‌న్ మ‌రియు రూర‌ల్ జిల్లాల‌ డీసీసీఅధ్య‌క్షుడు

Next Story