నేరం మేనేజ్‌మెంట్లది.. శిక్ష టీచర్లది

76
private teachers

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల యజామాన్యాల తప్పిదాల కారంణంగా రాష్ట్ర వ్యాప్తంగా 84,571 మంది టీచర్లు ప్రభుత్వ ఆర్థికసాయానికి దూరమయ్యారు. ప్రభుత్వ అధికారిక యూడైస్ వెబ్‌ సైట్‌లో 2018-19 ఏడాది వివరాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఈ ప్రకారమే ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించింది. ప్రతి ఏటా నూతనంగా చేరిన టీచర్ల వివరాలు నమోదు చేయకపోవడంతో ఈ సమస్యలు తలెత్తాయి. ఆర్థిక సాయం కోసం మొత్తం 2,09,873 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో 1,12,843 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందింది. సాయం అందని ప్రైవేటు టీచర్లు తమకు అన్యాయం చేయవద్దని అధికారులను వేడుకుంటున్నారు.

పాఠశాలల బంద్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ప్రతి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2వేలు నగదు, 25కిలోల సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు. ఈ వివరాలను ప్రైవేటు పాఠశాలల దగ్గర సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో పాఠశాలల యాజమాన్యాలు తమతమ సంస్థల్లో పనిచేసే సిబ్బంది వివరాలన్నిటిని పంపిచారు. యూడైస్ పోర్టల్ లో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వానికి అందించిన జాబితాను పరిగణలోకి తీసుకొని అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో అకాడమిక్ ఇయర్ మొదట్లో పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ తెలిపిన సిబ్బందికి మాత్రమే సహాయం అందింది. వివరాలు నమోదు చేయని సిబ్బందికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు.

యూడైస్‌లో వివరాలు నమోదు చేయని మేనేజ్‌మెంట్లు

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యూడైస్ వెబ్‌సైట్ లో 2018-19 నుంచి ఒకే వివరాలను నమోదు చేస్తూ వచ్చారు. ప్రతి ఏడాది అప్‌డేట్ చేసి కొత్తవారి వివరాలు నమోదుచేయాల్సి ఉండగా అలాంటి ప్రక్రియలను చేపట్టలేదు. సిబ్బంది సంఖ్యను తక్కవగా చేసి చూపించేందుకు చాలా వరకు పాఠశాలల యాజమాన్యాలు నూతనంగా చేరిన టీచర్ల వివరాలన నమోదు చేయలేదు. ఎక్కువ మంది టీచర్ల వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే నిబంధనల ప్రకారం సిబ్బందికి బెనిఫిట్స్ అందించాల్సి వస్తుందని తప్పుడు వివరాలను అందించారు. చాలా వరకు పాఠశాల్లో పని చేస్తున్నవారిలో సగానికిపైగా సిబ్బంది వివరాలు యూడైస్ పోర్ట్‌లో నమోదు కాలేదు. మేనేజ్‌మెంట్ల తప్పులకు టీచర్లు శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

84,571 మంది సిబ్బందికి సాయం కరువు

ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయాన్ని ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా 2,09,873 మంది సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం యూడైస్ పోర్టల్‌లోని వివరాల ప్రకారం 1,12,843 మందికి మాత్రమే ఆర్థిక సాయాన్ని అందించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 84,571 మంది ప్రైవేటు టీచర్లు ఆర్థిక సాయానికి దూరమయ్యారు. ప్రభుత్వం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడంతో పాఠశాలల్లో విధులు నిర్వహించే స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరి వివరాలు యూడైస్ పోర్టల్‌లో లేకపోవడంతో వీరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. ప్రైవేటు పాఠశాలలోని నాన్ టీచింగ్ సిబ్బంది వివరాల్లో యూడైస్‌లో నమోదు చేయబడిన అటెండర్లకు మాత్రమే ఆర్థిక సాయం అందింది.

వినతి పత్రాలు అందించాం

మేనేజ్‌మెంట్ల తప్పిదాల వలన ఆర్థిక సాయం అందుకోలేని టీచర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీఈఓ కేంద్రాల ముందు నిరసనలు కూడా తెలియజేసాము. ప్రభుత్వం పరిశీలించి పెండింగ్‌లో ఉన్న వారందరికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
– షబ్బీర్, ప్రైవేటు టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..