కరోనా రాజధానిగా హస్తిన

by  |
కరోనా రాజధానిగా హస్తిన
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కరోనాకు కేరాఫ్‌గా మారుతున్నది. నెల రోజుల నుంచి విపరీతంగా కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో దేశంలో అతిపెద్ద హాట్‌స్పాట్‌గా పరిణమించింది. అమెరికాకు న్యూయార్క్ సిటీ, బ్రెజిల్‌కు సావ్‌పావలో, రష్యాకు మాస్కోలాగా మనదేశానికి అత్యధిక కేసులున్న నగరంగా ఢిల్లీ మారింది. అంతేకాదు, మంగళవారం ప్రపంచంలోనే అత్యధిక కేసులు(3,947) రిపోర్ట్ చేసిన నగరంగా ఢిల్లీ రికార్డుల్లోకెక్కడం గమనార్హం. దేశంలో ఇన్నాళ్లు కరోనా కేసులతో ముంబయి దద్దరిల్లితే గురువారం ఈ నగరాన్ని ఢిల్లీ ఓవర్‌టేక్ చేసింది. వారం రోజులుగా రోజుకు సగటున 3,326 కొత్త కేసులను నమోదుచేస్తూ గురువారం ఉదయానికి 70వేల కేసుల మార్కును దాటేసింది. కాగా, ముంబయిలో మొత్తం కరోనా కేసులు 69,258గా నమోదయ్యాయి.

జూన్‌లో మారిన ముఖచిత్రం

ముంబయిలో తొలికేసు మార్చి 11న రిపోర్ట్ కాగా, మే 31వ తేదీ నాటికి మొత్తం కేసులు 39,686కి చేరాయి. తొలి కేసు మార్చి 2న నమోదైన ఢిల్లీలో మే చివరినాటికి మొత్తం కేసులు ముంబయి కన్నా తక్కువే(19,844), దాదాపు సగమున్నాయి. కానీ, గడిచిన 24 రోజుల్లోనే ఈ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ నెలలో ముంబయిలో కేసులు స్థిరంగా రిపోర్ట్ అయ్యాయి. కానీ, ఢిల్లీలో అంతకంతకు భారీగా కేసులు నమోదవుతూ వచ్చాయి. ముంబయిలో వారం రోజులుగా సగటున 1,134 కేసులు కొత్తగా రిపోర్ట్ అవుతుండగా, ఢిల్లీలో 3,326 నమోదవుతున్నాయి. ముంబయి కేసులు నెల క్రితంనాటి పరిస్థితులతో పోల్చితే మూడు రెట్లు తగ్గాయి. కానీ, ఢిల్లీలో ఎనిమిది రెట్లు పెరిగాయి. డబ్లింగ్ రేటు కూడా ముంబయి కన్నా ఢిల్లీలో ఆందోళనకరంగా ఉన్నది. నెలక్రితం ముంబయి డబ్లింగ్ రేటు 12రోజులుండగా ఢిల్లీది 15గా ఉన్నది. కానీ, నేడు ముంబయి డబ్లింగ్ రేటు 40 రోజులకు చేరగా ఢిల్లీది 12 రోజులుగా మారింది. అంటే ప్రతి 12 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయి.

టెస్టులు కారణమా?

ఢిల్లీలో ఇంతలా కేసులు పెరగడానికి టెస్టుల సంఖ్య కూడా కారణమై ఉండొచ్చని తెలుస్తున్నది. జూన్ తొలినాళ్లలో రోజుకు ఐదువేల టెస్టులు నిర్వహించారు. ఇప్పుడు ఈ సంఖ్యను 16వేలకు పెంచారు. కాగా, ముంబయిలో ఇంకా రోజుకు ఐదువేల టెస్టులే నిర్వహిస్తున్నారు. కేవలం 20 రోజుల్లోనే ఢిల్లీలో టెస్టులు దాదాపు 1.8 రెట్లు పెరిగాయి. జూన్ 23నాటికి ఇక్కడ మొత్తం 401,648 టెస్టులు నిర్వహించారు. కాగా, ముంబయిలో మొత్తం 2,99,379 టెస్టులు చేశారు.

మరణాల్లో ముంబయి కన్నా బెటర్

కరోనా కేసుల్లో ముంబయిని దాటేసినా ఈ మహమ్మారి కారణంగా మరణించినవారి సంఖ్యలో ఢిల్లీ ఓ మేరకు మెరుగ్గానే ఉన్నది. ఇప్పటి వరకు ఢిల్లీలో 2,365 కరోనా మరణాలు సంభవించగా, ముంబయిలో 3,964 చోటుచేసుకున్నాయి. అంతేకాదు, రికవరీ రేటులోనూ రాజధాని మంచి ప్రదర్శనే చూపిస్తున్నది. ముంబయి రికవరీ రేటు 53శాతముండగా ఢిల్లీది 59శాతమున్నది. ఢిల్లీలో 41,437 మంది కరోనా నుంచి కోలుకోగా, ముంబయిలో 37,008 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story

Most Viewed