ఇండియాలో అలా చూసి తట్టుకోలేక పోయాను : వార్నర్

by  |
ఇండియాలో అలా చూసి తట్టుకోలేక పోయాను : వార్నర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలో ఇండియాలో ప్రజలు శ్మశానాల వద్ద వారి బంధువుల అంతిమ సంస్కారాలు చేసేందుకు క్యూలు కట్టిన దృశ్యాలు, ఆక్సిజన్ దొరకక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు చూసి తట్టుకోలేక పోయానని సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ‘మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూమ్స్‌కు వచ్చి టీవీ పెడితే మొత్తం ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అంతే కాకుండా హోటల్ రూమ్ నుంచి స్టేడియంకు వెళ్తున్న సమయంలో కూడా ప్రత్యక్షంగా రోడ్ల వెంబడి నేరుగా చూశాను. అలా చూసి నా గుండె తరుక్కొని పోయింది’ అని డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌ను వాయిదా వేసి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకున్నది.. లేకపోతే ఇండియా నుంచి విదేశీ ఆటగాళ్లు బయటకు వెళ్లడం చాలా కష్టంగా మారేదని వార్నర్ అభిప్రాయపడ్డాడు. వీలైనంత త్వరగా ఇండియాను వదిలి వెళ్లాలనే మాల్దీవులకు వెళ్లామని.. మాలాంటి సమస్యనే ఎదుర్కున్న ఇతర దేశాల ఆటగాళ్లు కూడా అందుకే అక్కడకు వచ్చారని వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, యూఏఈలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ నిర్వహించనున్నారు. ఆ మ్యాచ్‌లకు ఆసీస్ ప్లేయర్లు హాజరవుతారో లేదా అనేది ఇంకా సందిగ్దంలోనే ఉన్నది.

Next Story

Most Viewed