స్వలింగ జంటల డేటింగ్ కోసం స్పెషల్ యాప్

202

దిశ, ఫీచర్స్: LGBTQ+ కమ్యూనిటీని సొసైటీ లో ఓ భాగంగా ఆమోదించే దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా అందుకు సహకరిస్తుండగా.. వారిపై ప్రచారంలో ఉన్న అపోహలు, దురభిప్రాయాలను రూపుమాపేందుకు సోషల్ మీడియా తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ స్వలింగ జంటలు పబ్ లేదా కేఫ్‌కు వెళ్లినపుడు సురక్షితంగా ఉంటున్నారా? అంటే కష్టమే. ఈ సమస్యలు దూరం చేసేందుకే శివమ్ కౌశిక్ అనే వ్యక్తి.. Glii పేరుతో కొత్త డేటింగ్ యాప్‌ ప్రారంభించాడు. ఇది LGBTQ+ వ్యక్తులు.. తమ ఫస్ట్ డేట్ కోసం రెస్టారెంట్‌ను బుక్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. తద్వారా వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

2020లో ప్రారంభించబడిన Glii ప్రధానంగా సేఫ్టీ పైనే దృష్టి సారిస్తోంది. చాలా వరకు డేటింగ్ యాప్స్ ఈ విషయం లోనే విఫలమయ్యాయి. ఇక యాప్ గురించి వివరించిన ఫౌండర్ కౌశిక్.. ఒక ఫ్రెండ్ లేదా రిలేషన్‌షిప్ కోసం తీవ్రంగా వెతుకుతున్న వ్యక్తుల కోసమే రూపొందించినట్లు తెలిపారు. ‘మీరు కనెక్ట్ అయ్యేందుకు ఒక మ్యాచ్‌, అందుకోసం వేదికగా ఒక రెస్టారెంట్‌ ఇస్తున్నాం’ అని చెప్పాడు. సరిపడే వ్యక్తి తారసపడ్డాక.. రెస్టారెంట్‌లో సీట్లను రిజర్వ్ చేయడానికి, ‘సురక్షితమైన’ స్థలంలో కలవడానికి Glii యాప్‌ను ఉపయోగించవచ్చని వెల్లడించాడు. అపరిచిత వ్యక్తిని మొట్టమొదటిసారి ఇంట్లో కలవడం లేదా అవతలి వ్యక్తి చెప్పిన ప్లేస్‌కు వెళ్లడం కంటే రెస్టారెంట్‌లో కలిస్తేనే మంచిదని.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే సదరు డేటింగ్ ముందుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

ఫుడ్ అగ్రిగేటర్ EazyDiner తో భాగస్వామ్యం కారణంగా Glii ఇప్పుడు భారతదేశంలో 8000 పైగా రెస్టారెంట్లతో యాక్సెస్‌ కలిగి ఉంది. ఇవన్నీ కూడా LGBTQ+ ఫ్రెండ్లీ రెస్టారెంట్స్ కాగా.. వీటిలో కొన్ని మాత్రం Glii యూజర్ల కోసం సేఫ్ జోన్‌ను సృష్టించాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ డేటింగ్ యాప్.. యూజర్ల బిహేవియర్‌ను విశ్లేషించి, సూటబుల్ మ్యాచ్‌ను సూచించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగిస్తుంది. ఇందులో బోగస్ ప్రొఫైల్స్‌ను గుర్తించే అవకాశంతో పాటు అలాంటి వ్యక్తుల గురించి రిపోర్ట్ చేసేందుకు కూడా ఒక మార్గం ఉంది. ఈ క్రమంలోనే యాప్‌లో యూజర్లందరూ డీసెంట్‌గా ప్రవర్తించాలని, లేకుంటే బ్లాక్ చేస్తామని ముందే హెచ్చరిస్తామని ఫౌండర్ కౌశిక్ తెలిపారు.