చేవెళ్ళ టు చేవెళ్ళ.. షర్మిల పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

by  |
చేవెళ్ళ టు చేవెళ్ళ.. షర్మిల పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి సంవత్సరం పాటు కొనసాగించి అక్కడే ముగించాలనుకుంటున్నారు. వైఎస్సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా అక్టోబరు 20న ప్రారంభించనున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో సాగే ఈ పాదయాత్ర రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతుందని స్వయంగా ఆమె వెల్లడించారు. ఈ పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్, స్ఫూర్తి వైఎస్సార్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతీ రోజు సాగటున 15 కి.మీ. మేర నడవనున్నట్లు తెలిపారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ అమరుల కోసం ఇప్పుడు చేస్తున్న దీక్ష ఇకపైన పాదయాత్రలోనూ కొనసాగనున్నట్లు తెలిపారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం తాగుబోతు తెలంగాణగా మారిందని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా, వైఎస్సార్ ఆశయాలను సాధించడమే ధ్యేయంగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడమే కర్తవ్యంగా ఈ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం పాదయాత్ర ఉండబోదని, ఆ తర్వాత విడిగా షెడ్యూలు చేయనున్నట్లు వివరించారు.

ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చుకున్నదని, ఇవి దేనికి ఖర్చయ్యాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నదన్నారు. ఇంత డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో తేలాలన్నారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆయన కుటుంబ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడేళ్ళ కాలంలో మహిళలపై దాడులు, నేరాలు సుమారు 300 శాతం పెరిగాయని, దళితులపై 800 శాతం పెరిగాయని, దీనికి ప్రధాన కారణం మద్యం, మత్తు పదార్ధాలేనని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైన్ షాపులు, బార్లు పెరిగాయని, మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిందన్నారు.


Next Story