నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి డీఎస్ తనయుడు.. ముహూర్తం ఫిక్స్

by  |
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి డీఎస్ తనయుడు.. ముహూర్తం ఫిక్స్
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాజకీయాలు క్షణక్షణానికి తీవ్ర ఉత్కంఠకు తెరతీస్తు్న్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పెద్దకుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించకున్నారు. కానీ ఇన్నిరోజులు దాని గురించి మాట్లాడలేదు. ఈ విషయంపై గురువారం ధర్మపురి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. దాదాపు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైపోయినట్టే అని హింట్ ఇచ్చారు. తండ్రి డీఎస్ మంతనాల వల్లే సంజయ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.

2004 నుంచి 2009 వరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కాంగ్రెస్ తరపున తొలి మేయర్‌గా సేవలందించిన ధర్మపురి సంజయ్ చివరకు ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.అందుకోసం ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. వచ్చే నెలలోనే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా ధర్మపురి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీఎస్ కాంగ్రెస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో తండ్రి కొడుకులు టీఆర్ఎస్‌లో చేరారు. రాజకీయంగా సంజయ్‌ను ఎదుర్కొలేని కొందరు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పలు కేసుల్లో ఇరికించారనే వాదనలున్నాయి. అప్పటివరకు క్రియాశీలకంగా పని చేసిన సంజయ్ టీఆర్ఎస్‌లో చేరినా అంటి ముట్టనట్టుగా ఉన్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2023 ఎన్నికల్లో సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదిపిన తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అడుగుజాడల్లో హస్తం కండువా కప్పుకోనున్నారు. రేవంత్ రెడ్డి కార్యవర్గంలో చోటు దక్కించుకున్న జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సంజయ్ రాకను అడ్డుకుని పార్టీలో చేర్చుకోవద్దని ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే లేఖలు రాశారు. దీంతో సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడం కష్టతరంగా మారింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన డీఎస్ పట్టువీడకుండా కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరుపుతూ రేవంత్ రెడ్డిని తన ఇంటికి రప్పించుకుని చక్రం తిప్పారు. ఇందులో భాగంగానే ధర్మపురి సంజయ్ నిజామాబాద్ అర్బన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారని తెలుస్తోంది. ఇటీవల సీనియర్ నాయకులు, పార్టీల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులను రెండురోజుల కిందట పిలిపించుకుని సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేయడంలో డీఎస్ సఫలం అయ్యారు.



Next Story

Most Viewed