ఆ మంత్రులకు చెప్పు దెబ్బలు తప్పవు : పిట్ట రాంరెడ్డి

by  |
Indira Shobhan
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రజలను దోచుకుంటున్నది.. హింసిస్తున్నది టీఆర్ఎస్ నాయకులేనని వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ద్రోహి, రాక్షసుడు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ తెలంగాణ ద్రోహి ఎలా అయ్యారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు ఎంత అభద్రత భావంలో ఉన్నారో ఈ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు. వారు కేవలం కేసీఆర్ మెప్పు కోసమే మాట్లాడినట్లుగా ఉందని చురకలంటించారు. వైఎస్సార్ పై వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో నేటికీ వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలే అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది టీఆర్ఎస్ నేతలేనని విమర్శలు చేశారు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటూ, పోడు భూములు లాక్కొని గిరిజనులను కొడుతున్నది మీరు కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని దుయ్యబట్టారు. దండుపాళ్యం ముఠాలా టీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని ఆమె విమర్శలు చేశారు. వైఎస్సార్ సరైన పద్ధతిలో విభజన జరగాలని చెప్పారే తప్పా తెలంగాణను వ్యతిరేకించలేదని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. క్యారెక్టర్ లేకుండా, గ్లాసులు పట్టుకొని తిరిగినందుకే ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కిందన్నారు.

అసలు గజదొంగలు మీరే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను దొంగలు అని వ్యాఖ్యానించడంపై షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి మండిపడ్డారు. అసలు గజదొంగలు మీరేనంటూ విమర్శలు చేశారు. మహానేతపై నిందలు మోపిన టీఆర్ఎస్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి సిగ్గుపడాలని విమర్శలు చేశారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆత్మపరిశీలన చేసుకోవాలని, మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని ఆయన హెచ్చరించారు.

షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే వైఎస్సార్ పై బురద జల్లుతున్నారని రాంరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా జూలై 8న పార్టీ ప్రకటన కచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story

Most Viewed