విషాదం.. అన్నదమ్ముల్లా కలిసుండే తండ్రీకొడుకులు మృతి

by  |
father and son died
X

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం విషాదం ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకొని తండ్రీకొడుకులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సమయంలో రంగువారిగూడెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు డానియల్(42), బాలు(22) అనే తండ్రీకొడుకులు బంధువు పొద్దుటూరి విజయ్ కుమార్‌తో కలిసి తప్పిపోయిన తమ ఆవులను గ్రామ శివారులోని వెతకసాగారు. ఈ క్రమంలో మామిడి తోట మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు అడవి పందుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలను తగిలి విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా బంధువు విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.

దీంతో గాయాలతోనే విజయ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు గమనించి విజయ్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట సీఐ బంధం ఉపేంద్రరావు, దమ్మపేట ఎస్ఐ వెంకటరాజు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి వివరాలు సేకరించారు. అన్నదమ్ముళ్లా కలిసుండే తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిత్యం ఎంతోమంది రైతులు తిరిగే అడవిలో విద్యుత్ తీగలను అమర్చడం ఆందోళన కలిగిస్తోందని, అమర్చిన వ్యక్తులను కనిపెట్టి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story