TRS VS BJP.. హుజురాబాద్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈసీ ప్రకటన

by  |
TRS VS BJP.. హుజురాబాద్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈసీ ప్రకటన
X

దిశ, హుజురాబాద్: దళితబంధు పథకం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ మండలం శాలపల్లిలో ప్రారంభించి పలువురు లబ్దిదారులకు రూ.10 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసి దాదాపు 17 వేల మందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. యూనిట్లను గ్రౌండ్ చేసే పనిలో అధికారులు నిమగ్నం కాగా.. హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ వెలువడక ముందు ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోలింగ్ కు ముందే యూనిట్లు అందజేయాలని ప్రత్యర్థి పార్టీలు డిమాండ్ చేస్తుండగా.. తాత్కాలికంగా నిలిపివేయాలని ఎన్నికల సంఘం సోమవారం రాత్రి ఆదేశించింది. కుట్ర కోణంలో భాగంగా దళితబంధు నిలిపివేశారని టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఈటల రాజేందర్ కారణంగానే దళిత బంధు ఆగిపోయిందని ఫైర్ అయ్యారు. దళితబంధు నిలిపివేతకు నిరసనగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఈటల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ నేతలు కూడా పోటీగా అర్దరాత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కుట్ర కోణమని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందనేది అర్థం కావడం లేదు.

విస్తృతంగా ప్రచారం చేయండి

దళిత బంధు స్కీం అర్థాంతరంగా ఆపడానికి కారణం బీజేపీ అని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బంధు అంశాన్ని హైలెట్ చేయాలని సూచించారు.

Next Story

Most Viewed