కొత్తగట్టుకు క్రషర్ కష్టాలు

by  |
కొత్తగట్టుకు క్రషర్ కష్టాలు
X

దిశ, పరకాల: స్టోన్‌ క్రషర్‌ల కోసం బండరాళ్లను తీసే క్వారీలో భారీ పేలుళ్లు భూకంపాన్ని తలపిస్తున్నాయి. పేలుళ్ల దాటికి తట్టుకోలేక చిన్నపిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ శబ్దాలకు ఇల్లు కనిపిస్తుండడంతో.. పిల్లలే కాదు పెద్దలు సైతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్రషర్ దుమ్ముతో పంట దిగుబడి తగ్గిపోతుంది. నీటి వనరులు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా స్టోన్ క్రషర్ లలో నిర్వహించే బోర్ బ్లాస్టింగ్ పొల్యూషన్ మూలంగా ఏర్పడే దుర్గంధాన్ని భరించలేక పోతున్నామని, పిండిలా కురుస్తున్న దుమ్ముతో ఇంట్లో సైతం మాస్కు ధరించాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి కలుషితంగా మారడం వల్ల అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

బోర్ బ్లాస్టింగులు జరుపుతున్న యాజమాన్యాల తీరుపై కొత్తగట్టు ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఫిర్యాదులు చెత్తబుట్టలోకి చేరుతున్నాయే తప్ప వారి సమస్యకు మాత్రం పరిష్కారం కానరావడం లేదు. ఎవరైనా క్రషర్ యాజమాన్యాలకు ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. క్రషర్ నిర్వహణ యాజమాన్యాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలవి కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా బోర్ బ్లాస్టింగ్స్ చేపట్టడంతో పాటు అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూన్నప్పటికీ ఎదురు లేకుండా పోతుంది. అందుకు ఉదాహరణగా వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం 270 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని సుమారు ఆరు ఎకరాలు కబ్జా చేయడంతో పాటు, పక్కనే ఉన్న చెరువు శిఖంలో ఇష్టారాజ్యంగా డస్ట్, కంకర నిల్వలు చేస్తుండటంతో చెరువు పూడుక పోవడంతో పాటు మత్స్యకారుల జీవనాధారమైన చేప పిల్లలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు జీవనోపాధి దెబ్బ తింటోంది.

అంతేకాకుండా కొత్తగట్టు నుంచి ఊరుగొండకు వెళ్లే రహదారిని ఆక్రమించి రహదారిపైనే క్రషర్‌ని నిర్మించడం చూస్తుంటే.. వీరి కబ్జా లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు..? ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో గ్రామస్తులు అనేక ఫిర్యాదులు చేసినా.. ఎందుకు పరిష్కారం చూపించలేకపోతున్నారు..? అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చా..? అనే ప్రశ్నలు గ్రామ ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా దిశ పత్రిక విలేఖరి జరిపిన పరిశీలనలో కనీసం తమ వాయిస్‌ని వినిపించడానికి సైతం భయపడుతున్నారు అంటే క్రషర్ యాజమాన్యాల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం కాకుండా పోదు.


Next Story

Most Viewed