నాన్నా..! ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు.. సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

by sudharani |   ( Updated:2023-11-08 08:36:08.0  )
నాన్నా..! ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు.. సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో యువత చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్నారు. పరిక్షల్లో ఫెయిల్ అయ్యామని, ఉద్యోగం రాలేదని, ఇంట్లో పేరెంట్స్ తిట్టారని ఇలా ప్రతి దానికి చావే శరణ్యం అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

వనపర్తి జిల్లా, రావల్ వెల్లి మండలం కేశంపేటకు చెందిన స్వామిగౌడ్, సరిత దంపతులకు కూతురు దివ్య (21), కొడుకు రవి కుమార్ ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన వీరు పాపిరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. స్వామిగౌడ్ డ్రైవర్‌‌గా చేస్తుండగా.. కొడుకు ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇక దివ్య డిగ్రీ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేది. ఇటీవల ఆ ఉద్యోగం కూడా మానేసి ఇంట్లో ఉండేది.

జాబ్ చేసుకోకుండా ఇంట్లో టీవీ, పోన్ చూస్తూ కాలం గడుపుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన దివ్య ‘నాన్నా.. నేను చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇక నేను టీవీ, ఫోన్ చూడను. ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దివ్య రాసిన సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed