భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

by Mahesh |
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య
X

దిశ, జనగామ: భర్త వేధింపులు ఓ వివాహిత యువతిని మృత్యువు వైపు నడిపించాయి. ఫలితంగా పెళ్లయిన ఐదు నెలలకే మనస్థాపానికి గురై తల్లి గారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచన పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. కంచన పల్లి గ్రామానికి చెందిన మద్దూరు కృష్ణ రేణుక దంపతులకు కుమార్తె హర్షిణి (20)ని గత మార్చిలో పాలకుర్తి మండలం లక్ష్మీనాపురం గ్రామానికి చెందిన మల్యాల వినేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం హర్షిని రెండు నెలల గర్భవతి. ఈ క్రమంలో హర్షిణిని భర్త వినేష్ 20 రోజుల క్రితం అత్తారింట్లో వదిలేసి వెళ్లాడు. తిరిగి గత నెల 31న వినేష్ తన అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో హర్షిణికి వినేష్ సెల్‌ఫోన్ లో వేరొక అమ్మాయితో తన భర్త అత్యంత చనువుగా ఉన్న ఫోటో కనిపించింది.

దీంతో ఆమె ఎవరు అని వినేష్‌ను ప్రశ్నించింది. దీంతో ఇరువురి మధ్య తగాదా చోటు చేసుకుంది. ఆ సమయంలో వినేష్ తన భార్య హర్షిణితో 'నీ ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే ఉరి వేసుకుని చనిపో, నీవు చనిపోతే ఆమెను పెళ్లి చేసుకుంటా' అని తిట్టేసి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హర్షిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్ను మూసింది. తన కూతురు హర్షిణి భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని మద్దూరు కృష్ణ రేణుక దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed