విషాదంలో విషాదం.. భర్త చిన్నకర్మ రోజే భార్య మృతి

by Sumithra |   ( Updated:2025-04-16 05:07:07.0  )
విషాదంలో విషాదం.. భర్త చిన్నకర్మ రోజే భార్య మృతి
X

దిశ, తిరుమలాయపాలెం : భర్త చిన్న కర్మ రోజు భార్య మృతి చెందిన విషాద ఘటన తిరుమలాయపాలెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఏలువారి గూడెం గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ (55) అనే వ్యక్తి, గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి భర్త మరణాన్ని తలచుకుంటూ భార్య పద్మ తీవ్రంగా రోధిస్తుంది. అక్కడ ఉన్న పద్మ పదేపదే భర్త మరణాన్ని తలుచుకుంటూ బాధపడుతుందని, అన్నయ్య వదిన అయినటువంటి తురక వెంకన్న- అనసూయ తిరుమలాయపాలెం గ్రామంలోని తమా ఇంటికి తీసుకొచ్చారు.

కాగా ఉపేందర్ మరణించి బుధవారం నాటికి మూడో రోజు కావవడంతో, చిన్నకర్మ నిర్వహించేందుకు బుధవారం ఉదయం తిరుమలాయపాలెం నుంచి ఏలువారిగూడెం గ్రామానికి బయల్దేరే క్రమంలో, పద్మ గుండెపోటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుమలాయపాలెం గ్రామంలోని సీహెచ్సీ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే పద్మ మృతి చెందినట్లు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో భర్తభార్యలు ఇద్దరు మృతి చెందడంతో ఏలువారి గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed