- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్థి సూసైడ్

దిశ, శేరిలింగంపల్లి : ఉన్నత చదువులు చదివిస్తే ప్రయోజకులు అవుతారని ఆశించి తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు చెల్లించి ఇన్స్టిట్యూట్ లకు పంపిస్తే అక్కడ వారు పెడుతున్న చదువుల ఒత్తిడికి విద్యార్థులు చిన్న వయసులోనే తనువులు చాలిస్తున్నారు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలతో పోటీ పడుతూ మరో విద్యా సంస్థ కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతూ వారి చావులకు కారణమవుతుంది. రాష్ట్రంలో ఈ మధ్యనే అడుగుపెట్టిన ఫిజిక్స్ వాలా అనే ఇన్సిట్యూట్ విద్యార్థి చావుకు కారణమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాదాపూర్ కాకతీయ హిల్స్ లో ఫిజిక్స్ వాలా వారి వద్ద నుండి ఫ్రాంఛైజీ తీసుకున్న కొందరు పలుచోట్ల బ్రాంచ్ లు ఓపెన్ చేశారు. ఫిజిక్స్ లో రాణించాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఇన్స్టిట్యూట్ లో తమ పిల్లలను చేర్పించారు. అయితే అక్కడ అధ్యాపకులు తమ ఇన్స్టిట్యూట్ ప్రతిష్ట కోసం, ర్యాంక్ ల కోసం విద్యార్థులపై చదువు చదువు అంటూ ఒత్తిడి పెడుతున్నారు.
దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇబ్రహీంపూర్ కు చెందిన రవీంద్ర కుమార్ సింగ్ తన కుటుంబంతో పాటు నగరానికి వచ్చి మియాపూర్ జేపీ నగర్ ఏలియన్స్ జేపీ నగర్ ఎల్ బ్లాక్ ప్లాట్ నెంబర్ 203లో ఉంటూ తన కొడుకు రుద్రసింగ్ ( 18) ను ఫిజిక్స్ వాలా ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడు. అయితే రుద్రసింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫిజిక్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అక్కడ అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక ఈనెల 1న మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను దూకి చనిపోయిన మూడు రోజుల తర్వాత కానీ విద్యార్థి మృతదేహం లభ్యం కాలేదు. అయితే అతని తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 171/ 2025 కింద కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు డీఆర్ ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. రెండు రోజుల తర్వాత దుర్గం చెరువులో తేలిన రుద్రసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఫిజిక్స్ వాలా ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల నిర్లక్ష్యం..
ఓ విద్యార్థి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినా ఫిజిక్స్ వాలా ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థి తల్లిదండ్రులు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిపై చదవమని, ర్యాంక్ లు తెచ్చుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇదే విషయంపై ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా మధ్యవర్తులు మినహా ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఫిజిక్స్ వాలా ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇన్స్టిట్యూట్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
కేసు నమోదు చేశాం దర్యాప్తు చేస్తున్నాం : ఏఎస్సై మాణిక్యరెడ్డి
తమ కుమారుడు తప్పిపోయాడంటు ఈనెల 1వ తేదీన రవీంద్రకుమార్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. అయితే గుర్తు తెలియని బాలుడు దుర్గం చెరువులో దూకాడు అన్న సమాచారంతో గాలింపు చేపట్టి వెలికి తీయగా అతను తప్పిపోయిన రుద్రసింగ్ గా గుర్తించామని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి మిస్సింగ్ కేసును సూసైడ్ గా మార్చామని, విచారణ కొనసాగుతుందని ఏఎస్సై మాణిక్య రెడ్డి తెలిపారు.